కోర్టుకెక్కిన తమిళనాడు ఎమ్మెల్యే ప్రేమ వివాహం!

  • సౌందర్యను కులాంతర వివాహం చేసుకున్న ప్రభు
  • కోర్టును ఆశ్రయించిన సౌందర్య తండ్రి స్వామినాథన్
  • నేడు సౌందర్యను కోర్టుకు తీసుకుని వస్తానన్న ప్రభు
తమిళనాడులోని కళ్లకురిచ్చి ఎమ్మెల్యే, అన్నాడీఎంకే నేత, తాను మనసిచ్చిన సౌందర్య అనే యువతిని కులాంతర వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తన కుమార్తెను కిడ్నాప్ చేసి, బెదిరింపులకు పాల్పడి, బలవంతంగా ప్రభు వివాహం చేసుకున్నాడంటూ, సౌందర్య తండ్రి స్వామినాథన్ కోర్టులో కేసు దాఖలు చేయడంతో, సౌందర్యను కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు.

తాజాగా, కోర్టు ఆదేశంపై స్పందించిన ప్రభు, తన భార్యను నేడు కోర్టు ముందు హాజరు పరిచేందుకు సిద్ధంగా ఉన్నానని, తన మామయ్యతో మాట్లాడాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా, ఆయన వినిపించుకోవడం లేదని అన్నారు. తామిద్దరమూ మేజర్లమని, ప్రేమించుకున్నామని చెప్పిన ఆయన, అనవసరంగా స్వామినాథన్ ఈ విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు ఆదేశాలను శిరసావహించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

కాగా, ఈ కేసులో సౌందర్య సైతం భర్త వెనుకే ఉండటం గమనార్హం. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఇష్టపూర్వకంగానే ప్రభును పెళ్లాడానని ఆమె తెలిపింది. అయితే, తన కుమార్తెను కాపాడాలంటూ, స్వామినాథన్ కోర్టులో పిటిషన్ వేయడంతో, ఆమెను తమ ముందు హాజరు పరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. స్వామినాథన్ త్యాగదుర్గం మలయమ్మన్ ఆలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నారు. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడం ఆయనకు ఇష్టం లేదని తెలుస్తోంది.


More Telugu News