పూరన్ బాదినా పంజాబ్‌కు తప్పని ఓటమి.. హైదరాబాద్ ఘన విజయం

  • సెంచరీ చేజార్చుకున్న బెయిర్‌స్టో
  • క్రీజులో ఉన్నంతసేపు స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన పూరన్
  • 69 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన ఎస్ఆర్‌హెచ్
ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో 69 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ వార్నర్, బెయిర్‌స్టో చెలరేగి ఆడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.

కెప్టెన్ వార్నర్, బెయిర్‌స్టోలు ఇద్దరూ క్రీజులో ఉన్నంత సేపు చెలరేగిపోయారు. బెయిర్‌స్టో అయితే  బౌలర్లను ఆటాడుకున్నాడు. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. మరోవైపు వార్నర్ కూడా ధాటిగా ఆడాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

చివరికి రవి బిష్ణోయ్ వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 52 పరుగులు చేసిన వార్నర్ మ్యాక్సీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత మూడో బంతికే సెంచరీకి చేరువగా ఉన్న బెయిర్‌స్టోను కూడా బిష్ణోయ్ దెబ్బకొట్టాడు. 55 బంతుల్లో 7 ఫోర్లు,  6 సిక్సర్లతో బెయిర్‌స్టో 97 పరుగులు చేసి సెంచరీకి మూడు పరుగుల దూరంలో అవుటయ్యాడు.

వీరిద్దరూ క్రీజులో ఉన్నంత వరకు స్కోరు 220 దాటుతుందని అభిమానులు భావించారు. అయితే వీరి భాగస్వామ్యం విడిపోయిన తర్వాత వికెట్లు టపటపా రాలిపోవడంతో స్కోరు వేగం నెమ్మదించింది. అబ్దుల్ సమద్ (8), మనీశ్ పాండే (1) నిరాశ పరచగా, విలయమ్సన్ 10 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ప్రియం గార్గ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగ్గా అభిషేక్ శర్మ 6 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 12 పరుగులు చేశాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.

అనంతరం 202 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ లక్ష్య ఛేదనలో తడబడింది. 16.5 ఓవర్లలో 132 పరుగులకే కుప్పకూలింది. కేఎల్ రాహుల్(11) తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తుండగా, మయాంక్ అగర్వాల్ (9) లేని రన్‌కు పోయి వికెట్ సమర్పించుకున్నాడు. నికోలస్ పూరన్ మాత్రం బాగానే పోరాడాడు. క్రీజులో ఉన్నంతసేపు ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

పూరన్ పూనకం వచ్చినట్టు ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటే హైదరాబాద్ బౌలర్లు ప్రేక్షకుల్లా మారిపోయారు. 37 బంతులు ఆడిన పూరన్ 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. అయితే, సహచరుల నుంచి సహకారం లభించకపోవడంతో అతడి మెరుపులు వృథా అయ్యాయి. క్రీజులోకి వచ్చిన వారు ఎవరో తరుముతున్నట్టు వెంటవెంటనే వికెట్లు పారేసుకున్నారు. పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లో ముగ్గురు డకౌట్ కాగా, ఐదుగురు ఆటగాళ్లు పట్టుమని 10 పరుగులు కూడా చేయలేకపోయారు.

పూరన్ చేసిన 77 పరుగుల తర్వాత రాహుల్, సిమ్రన్ సింగ్‌లు చేసిన 11 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. టెయిలెండర్లు చేతులెత్తేయడంతో పంజాబ్ 20 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేకపోయింది. 97 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సన్‌రైజర్స్ ఓపెనర్ బెయిర్‌స్టోకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.


More Telugu News