ఎదురులేని ముఖేశ్ అంబానీ... భారత్ లో మరోసారి నెంబర్ వన్

  • భారత బిలియనీర్ల జాబితా వెలువరించిన ఫోర్బ్స్
  • వరుసగా 13వ సారి ముఖేశ్ ఘనత
  • జాబితాలో నలుగురు తెలుగు వ్యాపారవేత్తలు
అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ మరోసారి భారత్ లో నెంబర్ వన్ సంపన్నుడిగా నిలిచారు. ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ ప్రకటించిన ర్యాంకుల్లో అంబానీ వరుసగా 13వ పర్యాయం ఈ ఘనత సాధించారు. దేశంలోనే అత్యంత ధనికుడిగా నిలిచిన ఈ రిలయన్స్ అధినేత ఆస్తి కూడా అమాంతం పెరిగిపోయింది. కొన్నాళ్ల కిందట 37.3 బిలియన్ డాలర్లుగా ఉన్న ముఖేశ్ సంపద ఇప్పుడు 88.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. భారత బిలియనీర్ల జాబితాలో ముఖేశ్ తర్వాత గౌతమ్ అదానీ రెండోస్థానంలో ఉన్నారు. ఆయన సంపద విలువ 25.2 బిలియన్ డాలర్లు.

ఫోర్బ్స్ జాబితాలో తెలుగు వ్యాపారవేత్తలు

ఈసారి ఫోర్బ్స్ సంస్థ వెలువరించిన టాప్-100 భారత బిలియనీర్ ర్యాంకుల జాబితాలో తెలుగు వ్యాపారవేత్తలు కూడా స్థానం దక్కించుకున్నారు. దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి దివి (6.5 బిలియన్ డాలర్లు) 20వ స్థానంలో, డాక్టర్ రెడ్డీస్ కుటుంబం (3.25 బిలియన్ డాలర్లు) 43వ స్థానంలో, మేఘా ఇంజినీరింగ్ పీపీ రెడ్డి (3.1 బిలియన్ డాలర్లు) 45వ స్థానంలో, అరబిందో రాంప్రసాద్ రెడ్డి (2.9 బిలియన్ డాలర్లు) 49వ ర్యాంకులో నిలిచారు.


More Telugu News