జీవం మనుగడకు వీలుగా మరో 24 గ్రహాలు.. గుర్తించిన పరిశోధకులు

  • భూమిని పోలిన గ్ర‌హాలు
  • జీవరాశి వృద్ధికి భూమి కన్నా మెరుగైన వాతావరణం
  • భూమి కన్నా పురాతనమైనవి, పెద్దవి
  • ఆస్ట్రాలజీ వెబ్‌ జర్నల్‌ ప్రచురణ
విశ్వంలో మనిషికి తెలియని ఎన్నో విష‌యాలు ఉన్నాయి. భూమిని పోలిన గ్ర‌హాలు ఇంకా ఏవైనా ఉన్నాయా? వాటిల్లో ప్రాణుల జీవ‌నానికి అనుకూల‌మైన ప‌రిస్థితులు ఉన్నాయా? అన్న ప్ర‌శ్న‌లకు స‌మాధానాన్ని వెతుకుతూ ఖ‌గోళ ప‌రిశోధ‌కులు త‌మ ప్ర‌య‌త్నాల‌ను కొన‌సాగిస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో తాజాగా, ఓ కీల‌క విష‌యాన్ని గుర్తించారు.

మ‌నిషి మనుగడకు అనుకూలమైన‌ భూమిని మించిన 24  గ్రహాలను వారు క‌నిపెట్టారు. వాట‌న్నింటిలో జీవరాశి వృద్ధికి భూమి కన్నా మెరుగైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ అధ్యయనంలో పరిశోధకులు గుర్తించిన ఈ వివ‌రాల‌ను ఆస్ట్రాలజీ వెబ్‌ జర్నల్‌ ప్రచురించింది. భూమికి వంద కాంతి సంవత్సరాల దూరంలో ఈ గ్ర‌హాల‌న్నీ ఉన్నాయని, భూమి కన్నా అవి పురాతనమైనవే కాకుండా ప‌రిమాణంలో పెద్దవిగా ఉన్నాయ‌ని చెప్పారు.

ఆయా గ్ర‌హాల్లో భూమి కంటే వేడి వాతావరణం, తేమ ఉన్న‌ట్లు తెలిపారు. ఆయా గ్రహాలు తిరిగే కక్ష్యల‌కు ద‌గ్గ‌ర్లో ఉండే నక్షత్రాలు సూర్యుడి కన్నా మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. అంతేగాక‌, వాటి జీవితకాలం కూడా సూర్యుడి కన్నా అధికమని తేల్చారు. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో వాటిల్లో జీవరాశి సులభంగా వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌ల  భవిష్య‌త్తు పరిశోధనలకు ఈ అధ్యయనం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చెప్పారు.


More Telugu News