కరోనా పరీక్షలపై సబ్సిడీని ఉపసంహరించిన ఐసీఎంఆర్... ఇక డబ్బు కట్టాల్సిందేనా?

  • రూ. 500 నుంచి రూ.3,200 వరకూ వసూలు చేయనున్న మేఘాలయ
  • రోగుల భోజనాలకు కూడా రుసుము వసూలుచేసే ఆలోచన
  • అదే దారిలో నిర్ణయాలు తీసుకోనున్న ఇతర రాష్ట్రాలు
కరోనా పరీక్షల టెస్టింగ్ కిట్ల నిమిత్తం కేంద్రం ఇస్తున్న సబ్సిడీని ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఐసీఎంఆర్ ఓ ప్రకటన చేయగా, రాష్ట్రాలన్నీ ఆ భారం భరించలేనిదని భావిస్తున్నాయి. ఇప్పటికే మేఘాలయా ప్రభుత్వం, ఈ నెల 16 నుంచి ప్రజలకు ఉచిత కరోనా టెస్ట్ లను చేయించలేమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రెస్టోన్ టిన్సాంగ్ స్వయంగా వెల్లడించారు. వచ్చే వారం నుంచి కరోనా పరీక్షలకు ప్రజలు డబ్బు చెల్లించాల్సి వుంటుందని ఆర్టీ-పీసీఆర్, సీబీ నాట్, ట్రూనాట్, రాపిడ్ యాంటీజెన్... ఇలా ఏ టెస్ట్ అయినా, రుసుము వసూలు చేస్తామని ఆయన అన్నారు.

ఇదే సమయంలో రోగులకు అందిస్తున్న ఉచిత భోజనాల సౌకర్యాన్నీ తొలగించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిపిన ఆయన, మరిన్ని క్వారంటైన్ కేంద్రాల కోసం హోటళ్లు, గెస్ట్ హౌస్ లను గుర్తించే పనిలో ఉన్నట్టు తెలిపారు. అయితే, జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోని వారు, పేదలకు మాత్రం ఉచితంగానే పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు అవసరమని, వారు రూ. 500 చెల్లించాల్సి వుంటుందని, ట్రూనాట్ తదితర ఇతర పరీక్షలకు గరిష్ఠంగా రూ. 3,200 వసూలు చేస్తామని అన్నారు. కాగా, కొవిడ్ టెస్టులకు ఇస్తున్న సబ్సిడీని తొలగించడంతో, పలు రాష్ట్రాలు ఇదే తరహా నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.


More Telugu News