ఈ-సేవ ఒప్పంద ఉద్యోగులను కూడా ఆప్కాస్ పరిధిలోకి తీసుకోవాలి: పవన్ కల్యాణ్

  • ఈ-సేవ కాంట్రాక్టు ఉద్యోగుల కష్టాలపై పవన్ స్పందన
  • ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని వ్యాఖ్యలు
  • ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి
గత 17 ఏళ్లుగా ఈ-సేవలో ఒప్పంద పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు ఒక్కసారిగా రోడ్డున పడ్డారని, ఇది బాధాకరమైన అంశమని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ఈ-సేవ కాంట్రాక్టు ఉద్యోగులకు 5 నెలలుగా జీతాలు ఇవ్వడంలేదని చెప్పారు. ఈ-సేవా కేంద్రాలకు సంబంధించిన విధుల్లో ఉన్న ఉద్యోగులను ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్ సర్వీసెస్ (ఆప్కాస్) పరిధిలోకి తీసుకోవాలని, తద్వారా వారి ఉపాధికి భరోసా ఇవ్వాలని పవన్ విజ్ఞప్తి చేశారు.  

రాష్ట్రంలో పట్టణ ఈ-సేవ కేంద్రాల్లో వివిధ ఉద్యోగాల్లో 607 మంది ఉన్నారని, వీరంతా నెలల తరబడి జీతాలు లేక, కుటుంబ పోషణ జరగక తీవ్ర ఆవేదనలో ఉన్నారని పేర్కొన్నారు. వేల ఉద్యోగాలు కల్పిస్తున్నామన్న ప్రభుత్వం ఏళ్ల తరబడి కాంట్రాక్టు ఉద్యోగాల్లో ఉన్నవారిని ఉపాధికి దూరం చేసి, నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడం భావ్యం కాదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ-సేవ కేంద్రాల నుంచి సేవా రుసుముల ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు.


More Telugu News