ప్రత్యేక హోదా అంటేనే వైసీపీ సర్కారు భయపడి పారిపోతోంది: రామ్మోహన్ నాయుడు

  • జగన్ ఢిల్లీ పర్యటనపై రామ్మోహన్ వ్యాఖ్యలు
  • సీఎంగా గెలిచింది కేసులు మాఫీ చేయించకోవడానికా? 
  • మోదీతో భేటీ వివరాలు ఎందుకు చెప్పలేకపోతున్నారన్న రామ్మోహన్
సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఘాటుగా స్పందించారు. 22 మంది లోక్ సభ ఎంపీలు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు, 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న జగన్ ను రాష్ట్ర ప్రజల తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నామని, ఇవాళ ముఖ్యమంత్రిగా మీరు గెలిచింది మీ కేసులు మాఫీ చేయించుకోవడానికా, లేక రాష్ట్ర ప్రయోజనాలపై మీరు పోరాటం చేయడానికా? అని అడిగారు.

మీరు ప్రధాని మోదీతో మాట్లాడింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే అయితే మీరు ఎందుకు ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించలేకపోతున్నారు? అని నిలదీశారు. ప్రధానితో 40 నిమిషాల పాటు ఈ విషయం మాట్లాడాను, హోదా ఇవ్వాల్సిందే అని నిలదీశామన్న మాట మీరు ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అని అడిగారు. ప్రత్యేక హోదా అంటేనే వైసీపీ భయపడి పారిపోయే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు.

"మీపై 11 సీబీఐ కేసులు సహా 31 కేసులు ఉన్నట్టు మీరే అఫిడవిట్ లో రాసుకున్నారు. మరి మీరు ఢిల్లీ వెళ్లి ఎవరికీ ఒక్క వివరణ కూడా ఇవ్వకుండా ఉంటే అనుమానం రాదా? మీరు వివరణ ఇవ్వకపోతే ఆ 31 కేసుల మాఫీ కోసమే వెళ్లారని భావించాల్సి ఉంటుంది. ప్రత్యేక హోదా వచ్చేవరకు అడుగుతూనే ఉంటాం అని నాడు చెప్పిన మీరు ఇవాళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎంపీలను వాడుకుంటున్నారు. ప్రజలు మిమ్మల్ని నమ్మి అంతమందిని గెలిపిస్తే మీరు కేసుల మాఫీ కోసం ప్రయత్నాలు చేయడం సరికాదు" అంటూ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.


More Telugu News