జగన్ క్విడ్‌ ప్రోకో-2కు తెరలేపారు: యనమల ఆరోపణలు

  • బినామీ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలి
  • 2004-09 మధ్య 'క్విడ్‌ ప్రోకో-1'
  • రుషికొండ భూములు జగన్‌ సొంతమయ్యాయి
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర ఆరోపణలు చేశారు.  అమరావతిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బినామీ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దర్యాప్తు జరపాలని అన్నారు.  2004-09 మధ్య 'క్విడ్‌ ప్రోకో-1'  జరిగిందని, ఇప్పుడు ఆయన క్విడ్‌ ప్రోకో-2కు తెరలేపారని యనమల ఆరోపణలు గుప్పించారు.

హెటిరో ముసుగులో విశాఖ బేపార్క్‌, బినామీల పేర్లతో రూ.300 కోట్ల విలువైన రుషికొండ భూములు జగన్‌ సొంతమయ్యాయని ఆయన చెప్పారు. జగన్‌పై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) తొలి ఛార్జిషీట్‌లో ఏ3గా అరబిందో, ఏ4గా హెటిరో ఉన్నాయని తెలిపారు. అరబిందోకు కాకినాడ సెజ్‌ కట్టబెట్టిన ఆయన, ఇప్పుడు హెటిరోకు విశాఖ బేపార్క్‌ కట్టబెడుతున్నారని ఆరోపణలు గుప్పించారు.

తమ ప్రభుత్వ పాలన సమయంలో విశాఖ రుషికొండ వద్ద అంతర్జాతీయ స్థాయిలో ఎకో టూరిజంలో భాగంగా కొండ మీద, కొండ కింద 36 ఎకరాల్లో అంతర్జాతీయ పర్యాటక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు చేతులు మారటం వెనుక ఎవరి పాత్ర ఉందని ఆయన ప్రశ్నించారు. వీటిల్లో అధిక శాతం వాటాలు ఎవరి ఒత్తిళ్ల మేరకు హెటిరో దక్కించుకుందని ఆయన నిలదీశారు.

కొండ మీద వాటాల కొనుగోళ్లకు ప్రతిఫలంగా కొండ కింద రూ.225 కోట్లు విలువ చేసే తొమ్మిది ఎకరాలు హెటిరోకు ఇవ్వడం మరో బినామీ లావాదేవీ అని ఆయన చెప్పారు. అప్పట్లో జడ్చర్ల సెజ్‌లో 75 ఎకరాలు హెటిరోకు కేటాయించినందుకు ప్రతిఫలంగా జగన్ సంస్థలో రూ.19.50 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సీబీఐ అధికారులు ధ్రువీకరించారని ఆయన చెప్పారు.


More Telugu News