సీఎం అభ్యర్థిని ఖరారు చేసిన అన్నాడీఎంకే!

  • పళనిస్వామే సీఎం అభ్యర్థి
  • సంతకం చేసిన పన్నీర్ సెల్వం 
  • సమసిన సంక్షోభం
గత కొన్ని రోజులుగా తదుపరి ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో సమాధానం లభించింది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని ముగిస్తూ, ప్రస్తుత సీఎం పళనిస్వామే, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ సీఎం అభ్యర్థని పార్టీ ప్రకటించింది.

ఆయన పేరును ఖరారు చేస్తూ, చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ ఉదయం జరిగిన భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. పళనిస్వామి పేరును మాజీ సీఎం పన్నీర్ సెల్వం స్వయంగా ప్రతిపాదించడంతో ఆయనకు మరెవరి నుంచీ పోటీ రాలేదు. ఇదే సమయంలో పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతను పన్నీర్‌ సెల్వంకు అప్పగిస్తూ కూడా నిర్ణయం వెలువడటం గమనార్హం.

అన్నాడీఎంకేలోని పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు తీసుకున్న ఈ నిర్ణయంపై ఇరునేతలూ సంతకాలు చేశారు. ఆపై 11 మంది సభ్యులతో స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో పళనిస్వామి మద్దతుదారులు ఆరుగురు, పన్నీర్‌ సెల్వం మద్దతుదారులు ఐదుగురు ఉండాలని కూడా ఇద్దరు నేతలూ ఒప్పందానికి వచ్చారు. దీంతో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై ఇప్పటి వరకు నడిచిన వివాదానికి తెరపడింది.

ఇక ఇద్దరు నేతలూ కలిసి సంయుక్తంగా ప్రకటన వెలువరించడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు.


More Telugu News