గెలవాలన్న కసిలో అంతే... కోహ్లీ చేసిన పనిపై సచిన్ టెండూల్కర్!

  • బంతికి ఉమ్మి రాసిన కోహ్లీ
  • పొరపాటు అయిపోయిందన్నట్టు సంజ్ఞ
  • ఢిల్లీతో నిన్నటి మ్యాచ్ లో ఘటన
కరోనా కాలం ప్రపంచాన్ని మార్చివేసింది. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఎన్నో నిబంధనలు పాటించడం తప్పనిసరైపోయింది. వాటిల్లో ఒకటి... క్రికెట్ మైదానంలో బంతికి ఉమ్మిని రాయకూడదన్నది. బౌలింగ్ సమయంలో బంతిపై ఉమ్మి రాయడం అన్నది చాలా సాధారణం. అయితే, ఈ చర్య వల్ల కరోనా మరింత త్వరగా వ్యాపించే ప్రమాదం ఉన్నందున ఐసీసీ దీన్ని నిషేధించింది.

ఈ తాజా ఐపీఎల్ సీజన్ లో అలవాటులో పొరపాటుగా బంతికి ఉమ్మి రాసిన ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల రాబిన్ ఉతప్ప, ఇదే పని చేసి హెచ్చరికలు అందుకోగా, తాజాగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, నిబంధనలను అతిక్రమించి, అందరి దృష్టిలో పడ్డాడు.

ఢిల్లీ కాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో మూడో ఓవర్ జరుగుతున్న వేళ, ఓపెనర్ పృథ్వీ షా ఆడిన షాట్ ను షార్ట్ కవర్ లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ అడ్డుకున్నాడు. ఆపై తన నోటి నుంచి ఉమ్మిని తీసి బంతికి పూశాడు. ఆ వెంటనే తాను చేసిన తప్పు తెలుసుకుని, పొరపాటై పోయిందన్నట్టు సంజ్ఞ చేశాడు. ఈ ఘటనపై సరదా కామెంట్లు వస్తున్నాయి.

దీన్ని చూసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. "గెలిచే కసిలో అంతే... అప్పుడప్పుడూ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి" అంటూ తన ట్విట్టర్ ఖాతాలో సచిన్ వ్యాఖ్యానించారు.


More Telugu News