'నిర్భయ' దోషుల లాయరే హత్రాస్ నిందితుల లాయర్!

  • కేసును ఒప్పుకున్న అజయ్ ప్రకాశ్ సింగ్
  • నిందితులు అమాయకులంటున్న క్షత్రియ మహాసభ
  • బాధితురాలి తరఫున వాదించనున్న సీమా సమృద్ధి
అజయ్ ప్రకాశ్ సింగ్... ఈ పేరు చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఇండియాలో తీవ్ర సంచలనం సృష్టించి, మహిళలపై జరుగుతున్న ఘోరాల నివారణకు చట్ట సవరణకు దారితీసిన నిర్భయ హత్యాచార కేసులో, దోషులకు ఉరిశిక్ష తప్పించేందుకు అన్ని విధాలా ప్రయత్నించి విఫలమైన న్యాయవాది.

ఇప్పుడీయన హత్రాస్ ఘటనలో దళిత బాలికపై అత్యాచారం చేసి, తీవ్రంగా దాడి చేసిన నిందితుల తరఫున కూడా వకాల్తా పుచ్చుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురి తరఫున వాదించేందుకు అఖిల భారతీయ క్షత్రియ మహాసభ, అజయ్ ప్రకాశ్ సింగ్ ను సంప్రదించగా, ఆయన అంగీకరించారు.

ఈ నలుగురు యువకులు అమాయకులని, వారిని రక్షించేందుకు కేసును అంగీకరించిన ఏపీ సింగ్ కు ధన్యవాదాలని ఈ సందర్భంగా క్షత్రియ మహాసభ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు, తమ వర్గంలోని కొందరిని ఈ కేసులో కావాలని ఇరికించారని, వారిని కాపాడేందుకు కట్టుబడివున్నామని, లాయర్ ఫీజులన్నీ మహాసభ స్వయంగా చెల్లిస్తుందని తెలిపారు.

ఇదిలావుండగా నిర్భయ తరఫున వాదనలు వినిపించి, వారికి ఉరిశిక్ష పడేలా చేసి, దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సుప్రీంకోర్టు న్యాయవాది సీమా సమృద్ధి ఖుష్వహ, హత్రాస్ బాధితురాలి తరఫున వాదించేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఈ కేసు విచారణ ఎలా సాగుతుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో నిందితులు దాడి చేశారే తప్ప, అత్యాచారం చేయలేదని రిపోర్టులు రావడంతో కేసు ఏ మేరకు నిలిచి, కఠిన శిక్ష పడుతుందన్న విషయమై సందేహాలు నెలకొనివున్నాయి.


More Telugu News