రాష్ట్రాలకు రూ. 44 వేల కోట్లను చెల్లిస్తాం: నిర్మలాసీతారామన్

  • ఈ రాత్రికి రూ. 20 వేల కోట్ల బదలాయింపు
  • వచ్చే వారంలోగా మరో రూ. 24 వేల కోట్ల బదలాయింపు
  • జీఎస్టీ పరిహార సెస్ వసూలును మరికొంత కాలం పొడిగిస్తామన్న కేంద్రం
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. జీఎస్టీ కింద రాష్ట్రాలకు రూ. 44 వేల కోట్లను బదలాయిస్తామని ప్రకటించారు. ఈ రాత్రికి రూ. 20 వేల కోట్లను బదలాయిస్తామని... వచ్చే వారంలోగా మరో రూ. 24 వేల కోట్లను బదలాయిస్తామని చెప్పారు. జీఎస్టీ సెస్ ను ఐదేళ్ల పాటు విధించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గతంలో అంగీకారం కుదిరింది. అయితే కరోనా వల్ల రాష్ట్రాలు ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో, జీఎస్టీ పరిహార సెస్ వసూలును మరికొంత కాలం పొడిగిస్తామని కేంద్రం తెలిపింది.

రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్ ఈరోజు సమావేశమైన సంగతి తెలిసిందే. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో జీఎస్టీ పరిహారం చెల్లింపుపై కేంద్రం ఎటూ తేల్చకపోవడంతో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిర్మల కీలక ప్రకటన చేశారు. మరోవైపు కేంద్రం చెల్లించాల్సిన రూ. 97,000 కోట్ల జీఎస్టీ పరిహారంపై రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి.


More Telugu News