గాయంతో ఐపీఎల్ కు దూరమైన భువనేశ్వర్... ఆస్ట్రేలియా టూర్ కు డౌటే!

  • చెన్నైతో మ్యాచ్ లో గాయపడ్డ భువీ
  • బౌలింగ్ చేయలేక మైదానం నుంచి నిష్క్రమణ
  • భువీకి 8 వారాల విశ్రాంతి అవసరమన్న బీసీసీఐ!
యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయంతో ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. అక్టోబరు 2న చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ చివర్లో బౌలింగ్ చేసేందుకు చాలా ఇబ్బందిపడ్డాడు. బౌలింగ్ వేయలేక మైదానం నుంచి వెళ్లిపోయాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు ఏకంగా ఐపీఎల్ కే దూరమయ్యాడు.

దీనిపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, భువీ గాయం గ్రేడ్-2 లేదా గ్రేడ్-3 తరహాకు చెందుతుందని, గాయం తీవ్రత దృష్ట్యా టోర్నీలో కొనసాగలేని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. కనీసం 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. దాంతో, ఐపీఎల్ తర్వాత జరిగే ఆస్ట్రేలియా టూర్ కు కూడా భువీ దూరమయ్యే అవకాశాలున్నాయని వివరించారు.

ఇప్పటికే మిచెల్ మార్ష్ వంటి నాణ్యమైన ఆల్ రౌండర్ గాయంతో జట్టుకు దూరం కాగా, కొత్తబంతితో ప్రభావవంతంగా బౌలింగ్ చేసే భువనేశ్వర్ కుమార్ కూడా తప్పుకోవడం సన్ రైజర్స్ అవకాశాలపై ప్రభావం చూపుతుందని చెప్పాలి.


More Telugu News