ఈ ఏడాది ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలకు ప్రతిష్ఠాత్మక నోబెల్ ప్రైజ్

  • హెపటైటిస్ సి వైరస్ గుట్టురట్టు చేసిన ఆల్టర్, హాటన్, రైస్
  • రక్తం ద్వారా వ్యాపించే హెపటైటిస్ సి
  • ఇకపై మరింత సులువుగా 'హెపటైటిస్ సీ'ని గుర్తించే వీలు
ఈ ఏడాది వైద్యరంగంలో ముగ్గురు పరిశోధకులను ప్రతిష్ఠాత్మక నోబెల్ ప్రైజ్ వరించింది. అమెరికా వైరాలజీ శాస్త్రవేత్త హార్వే జె ఆల్టర్, బ్రిటీష్ పరిశోధకుడు మైకేల్ హాటన్, అమెరికా ప్రొఫెసర్ చార్లెస్ ఎం రైస్ లను 2020 ఏడాదికి గాను వైద్యరంగంలో నోబెల్ విజేతలుగా ప్రకటించారు. మానవాళి పాలిట ప్రాణాంతకంగా పరిణమించే హెపటైటిస్ సి వైరస్ పై వీరి పరిశోధనలు అత్యున్నత పురస్కారాన్ని సంపాదించిపెట్టాయి.

రక్తం ద్వారా వ్యాపించే హెపటైటిస్ సి వైరస్ ను ఎలా ఎదుర్కోవాలి? అనేదానిపై ఆల్టర్, హాటన్, రైస్ త్రయం చేసిన పరిశోధనలు వ్యాధి చికిత్సలో ఎంతో ఉపయుక్తమని భావిస్తున్నారు. ఇప్పటివరకు హెపటైటిస్ సి వైరస్ సోకితే నయం చేయడం కష్టమని భావించేవారు. అయితే ఈ పాశ్చాత్య దేశాల శాస్త్రజ్ఞుల త్రయం పరిశోధనలతో హెపటైటిస్ సి వైరస్ జన్యుక్రమం వెల్లడైంది. హెపటైటిస్ సి సోకితే లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల బారినపడతారు. ప్రపంచవ్యాప్తంగా ఇది గణనీయమైన స్థాయిలో మరణాలకు కారణమవుతున్న వైరస్ గా గుర్తించారు.

ఇప్పటివరకు హెపటైటిస్ ఎ, హెపటైటిస్ బి వైరస్ లక్షణాలను గుర్తించినా, ప్రధానంగా రక్తమార్పిడి ద్వారా సంక్రమించే హెపటైటిస్ సి మాత్రం అపరిష్కృతంగా మిగిలిపోయింది. ఇప్పుడీ త్రయం సాగించిన పరిశోధనల ఫలితంగా బ్లడ్ టెస్టుల ద్వారా హెపటైటిస్ సి వైరస్ ను గుర్తించడం సులువుగా మారనుంది. అంతేకాదు, హెపటైటిస్ సి బాధితుల కోసం కొత్త ఔషధాలు తయారుచేసేందుకు మార్గం సుగమం అయింది.



More Telugu News