ఇండియాలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు!

  • గత వారం 5.5 లక్షల కొత్త కేసులు
  • గరిష్ఠ కేసుల వారంతో పోలిస్తే 15 శాతం తక్కువ
  • భవిష్యత్తులో మరింతగా తగ్గే అవకాశం
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. వరుసగా మూడవ వారంలోనూ కొత్త కేసుల సంఖ్య పడిపోయింది. గడచిన సెప్టెంబర్ నెలలో గరిష్ఠ స్థాయిలో రోజుకు దాదాపు లక్ష కొత్త కేసులు వచ్చిన పరిస్థితి నుంచి, ఇప్పుడు వైరస్ వ్యాప్తి నిదానిస్తోందని చెప్పడానికి తాజా గణాంకాలే నిదర్శనం. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 వరకూ కొత్తగా 5.5 లక్షల కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇది గడచిన ఐదు వారాల్లోనే అతి తక్కువ.

ఇక ప్రతి వారం నమోదవుతున్న మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతోంది. గడచిన ఏడు రోజుల్లో 7,143 మరణాలు నమోదుకాగా, గడచిన నాలుగు వారాల వ్యవధిలో ఇదే అతి తక్కువ. కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ 14 నుంచి 20 మధ్య 8,175 మరణాలు నమోదుకాగా, ఆపై మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది.

ఇక సెప్టెంబర్ లో 7 నుంచి 13వ తేదీ మధ్య ఇండియాలో అత్యధికంగా, 6,45,014 కొత్త కేసులు వచ్చాయి. ఇక గతవారంలో నమోదైన 5,50,545 కేసుల సంఖ్య, గరిష్ఠ కేసులు నమోదైన వారంతో పోలిస్తే 15 శాతం తక్కువ కాగా, సెప్టెంబర్ 27తో ముగిసిన వారంతో పోలిస్తే 6.8 శాతం తక్కువ. అంటే, వారం రోజుల వ్యవధిలో కొత్త కేసుల సంఖ్య 39 వేలకు పైగా తగ్గింది.

సమీప భవిష్యత్తులోనూ ఇదే ట్రెండ్ నమోదవుతుందని, డిసెంబర్ నాటికి కేసుల సంఖ్య మరింతగా తగ్గుతుందని, చలికాలంలో వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశాలు ఉన్నప్పటికీ, ఈ రెండు నెలల వ్యవధిలో భారతీయుల్లో కరోనా నిరోధక శక్తి కూడా స్వల్పంగానైనా పెరుగుతుందని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటే, కేసుల సంఖ్య మరింతగా తగ్గుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.


More Telugu News