నమ్మించి నట్టేట ముంచిన కుటుంబం.. జనానికి రూ. 3.50 కోట్లకు కుచ్చుటోపీ

  • ఖమ్మంలో ఘరానా మోసం
  • వడ్డీ ఆశ చూపి నమ్మిన వారి నుంచి డబ్బులు వసూలు
  • వ్యాపారం పేరుతో కోట్లలో నిత్యావసరాలు తీసుకుని మోసం
కోట్లలో వ్యాపారం చేస్తానంటూ జనాన్ని నమ్మించి రూ. 3.50 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన ఓ మహిళను ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన పురాణం శివకుమారి ముగ్గురు కుమారులతో కలిసి ఖమ్మంలో ఉంటోంది. జిల్లాలోని కొన్ని సంస్థలకు నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తున్నట్టు చెప్పుకునేది. ఈ క్రమంలో వ్యాపారుల నుంచి కోట్ల రూపాయల విలువైన పెసలు, కందిపప్పు, బియ్యం తదితరాలను తీసుకునేది. అలాగే, నాలుగు రూపాయల వడ్డీ ఇస్తానని ఆశ చూపి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసింది.

వ్యాపారులను నమ్మించేందుకు తొలుత కొంత డబ్బులు చెల్లించేది. ఆ తర్వాత రేపు, మాపు అంటూ వాయిదా వేస్తూ వచ్చింది. ఈ క్రమంలో రూ. 70 లక్షలు ఇచ్చిన ఖమ్మం రూరల్ మండలానికి చెందిన మాలోతు సునీత మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలి కుమారులైన పురాణం శివ, పురాణం శంకర్‌లను నిన్న అరెస్ట్ చేశారు. కీలక నిందితురాలైన పురాణం శివకుమారి, పురాణం గోపీకృష్ణ పరారీలో ఉన్నారు. వీరిపై మొత్తం ఏడు చీటింగ్ కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.


More Telugu News