ధోనీ సేనతో ఓటమికి కారణాలు తెలుసు: కేఎల్ రాహుల్

  • నిన్నటి మ్యాచ్ లో కేఎక్స్ ఐపీ ఘోర పరాజయం
  • ఒక్క వికెట్ ను కూడా తీయలేకపోయిన పంజాబ్ జట్టు
  • మరింత ప్రాక్టీస్ చేస్తామన్న కేఎల్ రాహుల్
ఈ ఐపీఎల్ సీజన్ లో టైటిల్ సాధించేందుకు అవసరమైన సత్తా ఉన్న జట్లలో ఒకటిగా ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, వరుస ఓటములతో ప్రస్తుతం సతమతమవుతోంది. నిన్న ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైన తరువాత, పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందించాడు. తాము ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసునని, మరింత బలంగా పుంజుకుంటేనే అవకాశాలు లభిస్తాయని అన్నాడు.

నిన్నటి మ్యాచ్ లో తాము కనీసం ఒక్క వికెట్ ను కూడా తీయలేకపోయామని, తమ ప్లాన్ ను అమలు చేయడంలో విఫలం అయ్యామని, విధ్వంసకర ఆటగాళ్లయిన షేన్ వాట్సన్, డూప్లెసిస్ వికెట్లు తీయకుంటే, ఏ జట్టుకు అయినా చిక్కులే మిగులుతాయని అన్నారు. వరుసగా ఓడిపోవడం బాధను కలిగిస్తోందని, తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడం కష్టమేమీ కాదని అన్నాడు. తొలుత తాము బ్యాటింగ్ చేస్తున్న వేళ, పిచ్ నెమ్మదిగా ఉందని, సమయం గడిచే కొద్దీ బ్యాటింగ్ కు అనుకూలించిందని కేఎల్ రాహుల్ అన్నాడు.

తమ జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారని, వారంతా తిరిగి పుంజుకుంటే, తమ జట్టు కూడా గెలుపు బాట పడుతుందని అంచనా వేసిన రాహుల్, తాము ఇకపై మరింతగా సాధన చేస్తామని, తదుపరి మ్యాచ్ లలో రాణిస్తామనే భావిస్తున్నామని తెలిపాడు. కాగా, ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు 178 పరుగులు చేయగా, ధోనీ సేన, ఒక్క వికెట్ ను కూడా నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అత్యధిక తొలి వికెట్ భాగస్వామ్యం ఇదే కావడం గమనార్హం.


More Telugu News