ఆఫ్ఘనిస్థాన్ లో ఆత్మాహుతి దాడి... అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ మృతి!

  • నంగర్ హార్ ప్రావిన్స్ లో ఘటన
  • గవర్నర్ నివాసం వద్ద ఆత్మాహుతి దాడి
  • కుటుంబ సభ్యుల సహా అంపైర్ షిన్వారీ మరణం
ఆఫ్ఘనిస్థాన్ మరోసారి నెత్తురోడింది. నంగర్ హార్ ప్రావిన్స్ లోని ఘనిఖిల్ జిల్లా గవర్నర్ నివాసం వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ బిస్మిల్లా జాన్ షిన్వారీ ఉన్నట్టు తెలుస్తోంది. షిన్వారీ అనేక అంతర్జాతీయ, ఆఫ్ఘన్ దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లకు అంపైరింగ్ విధులు నిర్వర్తించారు. ఈ ఆత్మాహుతి దాడిలో ఆయన కుటుంబం కూడా బలైనట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ దాడిలో మొత్తం 15 మంది మృతి చెందగా, 30 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. పేలుడు అనంతరం కొందరు సాయుధులు గవర్నర్ నివాసంలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా, భద్రతా సిబ్బంది వారిని కాల్చి చంపారు. కాగా, ఆత్మాహుతి దాడి ఘటనను నంగర్ హార్ గవర్నర్ కార్యాలయం ధ్రువీకరించింది. అయితే ఈ ఘటనలో అంపైర్ షిన్వారీ మృతి చెందలేదని మరికొన్ని కథనాలు వస్తున్నాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

రెండ్రోజుల కిందట ఓ ఆఫ్ఘన్ క్రికెటర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఆఫ్ఘనిస్థాన్ జాతీయ జట్టు ఓపెనర్ నజీబుల్లా తర్కాయ్ కారు యాక్సిడెంట్ ఘటనలో ఆసుపత్రి పాలయ్యాడు. ఇప్పుడతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వరుస ఘటనలతో ఆఫ్ఘన్ క్రికెట్ వర్గాలు విచారంలో మునిగిపోయాయి.


More Telugu News