మానవాళికి కరోనా వ్యాక్సిన్ కోసం... 5 లక్షల షార్క్ చేపలను చంపాల్సిందేనా?!

  • షార్క్ చేపల్లో స్కూవాలేన్ లివర్ ఆయిల్
  • 3 వేల షార్క్ ల నుంచి టన్ను ఆయిల్
  • ప్రత్యామ్నాయాలు వెతకాలన్న షార్క్ ఎలీస్
భువిపై నుంచి కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ తయారీలో పలు దేశాలు నిమగ్నమై, ముందడుగు వేస్తున్న వేళ, మొత్తం ప్రజలందరికీ వ్యాక్సిన్ ను సరఫరా చేయాలంటే, కనీసం 5 లక్షల షార్క్ చేపలను బలిచేయాల్సిందేనని వచ్చిన వార్తలు జంతు ప్రేమికులను కలవరపెట్టాయి. షార్క్ చేపలో ఉండే లివర్ ఆయిల్ లో మాత్రమే కనిపించే 'స్కూవాలేన్' అనే సహజసిద్ధమైన నూనెను వ్యాక్సిన్ తయారీలో వినియోగించనున్నారు.

అయితే, చాలా వరకూ వాణిజ్యపరమైన వ్యాక్సిన్ లలో ఈ స్కూవాలేన్ నూనెను వాడుతుంటారు. ఈ నూనె వాడుతూ తయారు చేసే వ్యాక్సిన్, శరీరంలో రోగనిరోధక శక్తిని మరింతగా పెంచుతుంది. ఈ విషయాన్ని గుర్తు చేసిన 'షార్క్ ఎలైస్' అనే స్వచ్ఛంద సంస్థ, ఒక టన్ను స్కూవాలిన్ కోసం కనీసం 2,500 నుంచి 3 వేల షార్క్ లను హతమార్చాల్సి వుంటుందని, మొత్తం జనాభాకు ఒక డోస్ వ్యాక్సిన్ కావాలంటే, 2.50 లక్షలకు పైగా షార్క్ లను చంపాల్సి వుంటుందని అన్నారు.

రెండు డోస్ ల వ్యాక్సిన్ అవసరమని భావిస్తే, 5 లక్షల షార్క్ చేపలను హతం చేస్తారని చెబుతూ, ఓ నివేదికను విడుదల చేయగా, దాన్ని 'యూరో న్యూస్' ప్రచురించింది. లక్షలాది షార్క్ లను స్వల్ప కాల వ్యవధిలో చంపడం వల్ల మహా సముద్రాల్లో సమతుల్యత దెబ్బతింటుందని, భవిష్యత్ పరిణామాలను కూడా మనసులో ఉంచుకుని ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని ఈ రిపోర్టు కోరింది.

షార్క్ చేపలను హతమార్చడానికి బదులుగా, చెట్ల నుంచి వచ్చే నూనెలను, సింథటిక్ ప్రత్యామ్నాయాలను వ్యాక్సిన్ తయారీకి పరిశీలిస్తే మంచిదని షార్క్ ఎలీస్ వ్యవస్థాపకుడు స్టిఫానీ బ్రాండెల్ సలహా ఇచ్చారు. కరోనాకు వ్యాక్సిన్ తయారీ తప్పనిసరే అయినా, దీని తయారీ కారణంగా ప్రపంచ జంతు సమతుల్యత దెబ్బతినరాదన్నదే తమ ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు.


More Telugu News