ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విశ్వాస ఘాతకుడు: సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్

  • వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కేసీఆర్
  • ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలన్న బండి సంజయ్
  • రైతుల మనోభావాలు తెలుసుకోవాలని సూచన
తెలంగాణ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని సంజయ్ నిలదీశారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించడం కేసీఆర్ కు అలవాటైందని మండిపడ్డారు. ఏ విధంగా రాజకీయాలు చేయాలి, కుటుంబం అంతా కలిసి ఏ విధంగా దోచుకోవాలి, ప్రజల దృష్టి మరల్చడానికి ఏంచేయాలనేది తప్ప కేసీఆర్ కు మరో ఆలోచన ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల అభివృద్ధి, రైతు కుటుంబాల సంక్షేమం పట్ల ఈ సీఎంకు ఎలాంటి చిత్తశుద్ధిలేదని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విశ్వాస ఘాతకుడు అని బండి సంజయ్ విమర్శించారు. దేశం మొత్తం వ్యవసాయ చట్టం గురించి మాట్లాడుతుంటే, కాంగ్రెస్, కమ్యూనిస్టుల పక్కన చేరి చట్టాలను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టంపై రైతులు ఏమనుకుంటున్నారో ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ ఓసారి వ్యవసాయ చట్టం తాలూకు బిల్లు మొత్తం చదవాలని, అప్పటికీ అర్థంకాకపోతే కేసీఆర్ అంతటి మూర్ఖుడు మరెవ్వరూ ఉండరని వ్యాఖ్యానించారు.



More Telugu News