కరోనా ఎఫెక్ట్: ప్రొడ్యూసర్స్ గిల్డ్, 'మా' మధ్య కీలక ఒప్పందం

  • రూ.5 లక్షలకు మించితే పారితోషికంలో 20 శాతం కోత
  • రోజుకు రూ.20 వేల కంటే తక్కువ తీసుకునేవారికి మినహాయింపు
  • హైదరాబాదులో సమావేశమైన 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులు
కరోనా మహమ్మారి కారణంగా బాగా దెబ్బతిన్న రంగాల్లో సినీ పరిశ్రమ కూడా ఉంది. చిత్రీకరణలు నిలిచిపోవడమే కాదు, థియేటర్లు కూడా మూతపడ్డాయి. మళ్లీ ఇప్పుడు కేంద్రం థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వడంతో సినీ రంగంలో ఉత్సాహం కనిపిస్తోంది. అయితే, కరోనా ప్రభావంతో ఆర్థిక నష్టాలు పెరిగిపోయిన నేపథ్యంలో యాక్టివ్ తెలుగు సినీ నిర్మాతల గిల్డ్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) మధ్య కీలక ఒప్పందం కుదిరింది.

ఈ ఒప్పందం ప్రకారం ఒక్కో సినిమాకు రూ.5 లక్షల కంటే ఎక్కువ తీసుకునే నటులు, సాంకేతిక నిపుణులు తమ పారితోషికంలో 20 శాతం తగ్గించుకోవాల్సి ఉంటుంది. అయితే దినసరి విధానంలో రోజుకు రూ.20 వేల కంటే తక్కువ తీసుకునేవారి విషయంలో మినహాయింపు ఇచ్చారు.

ఇవాళ హైదరాబాదులో 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులు సమావేశమై కరోనా పరిస్థితులపై చర్చించారు. కరోనా ప్రభావం నుంచి చిత్ర పరిశ్రమ తేరుకునేవరకు ఖర్చులు తగ్గించుకోవాలని నిర్ణయించారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ నిర్ణయాలను సమీక్షిస్తామని యాక్టివ్ తెలుగు సినీ నిర్మాతల గిల్డ్ ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు చిత్రపరిశ్రమ మళ్లీ కళకళలాడాలన్నదే తమ అభిమతమని పేర్కొంది.


More Telugu News