కరోనా సమస్య ఏదైనా మా వెబ్ సైట్ దృష్టికి తీసుకురండి... పార్టీ ముందుండి పోరాడుతుంది: చంద్రబాబు

  • రాష్ట్రంలో కరోనా కేసులు 7 లక్షలు దాటాయన్న చంద్రబాబు
  • రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యలు
  • ఓపెన్ ఫోరం ఏర్పాటు చేశామన్న చంద్రబాబు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉపాధి కోల్పోవడం, మందులు దొరక్కపోవడం, సకాలంలో అంబులెన్స్ లు రాకపోవడం, నిత్యావసరాల కొరత, పంట నష్టం... ఇలా కరోనా కారణంగా ఏర్పడిన ఏ సమస్య అయినా టీడీపీ ప్రారంభిస్తున్న ఏపీఫైట్స్ కరోనా డాట్ కామ్ (apfightscorona.com) వెబ్ సైట్ దృష్టికి తీసుకురావాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. ఆ సమస్య పరిష్కారానికి పార్టీ ముందుండి పోరాడుతుందని అన్నారు.

ఏపీలో కరోనా కేసులు 7 లక్షలు దాటిపోయాయని, కరోనాను నియంత్రించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మరోవైపు లాక్ డౌన్ కారణంగా అనేకమంది జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని, రైతుల పరిస్థితి మరీ ఘోరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఏపీలో పేద కుటుంబాలు రోజువారీ ఆహారధాన్యాలకు కూడా కటకటలాడుతున్నాయని, ఈ విపత్కర పరిస్థితుల్లో బాధ్యతాయుత రాజకీయ పార్టీగా రాష్ట్ర ప్రజల ఇబ్బందుల పరిష్కారానికి టీడీపీ ఒక ఓపెన్ ఫోరం ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ఎలాంటి సమస్యనైనా టీడీపీ పార్టీ ఏర్పాటు చేసిన వెబ్ సైట్ కు తెలిపితే, ఆ సమస్య పరిష్కారానికి పార్టీ ముందుండి పోరాడుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.


More Telugu News