ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు... తొలి మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్

  • తొలి మ్యాచ్ లో రాజస్థాన్ తో బెంగళూరు ఢీ
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
  • రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్
ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30కు ప్రారంభమయ్యే మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఇక, సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమయ్యే మరో పోరులో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ ఢీకొంటాయి.

ఇక, మొదటి మ్యాచ్ విషయానికొస్తే... బెంగళూరుపై టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇటీవల టాస్ గెలిచి ఛేజింగ్ కు మొగ్గు చూపిన జట్లకు ఏదీ కలిసిరాకపోవడంతో జట్లు ట్రెండ్ మార్చాయి. మొదట బ్యాటింగ్ చేయడానికే ఇష్టపడుతున్నాయి.

రాజస్థాన్, బెంగళూరు జట్లు చెరో మూడు మ్యాచ్ లు ఆడి రెండేసి విజయాలతో ఫర్వాలేదనిపిస్తున్నా, కీలకమైన రన్ రేట్ విషయంలో వెనుకబడి ఉన్నాయి. ఈ రెండు జట్ల రన్ రేట్ మైనస్ లోనే ఉంది. జోస్ బట్లర్, స్టీవెన్ స్మిత్, సంజు శాంసన్, రాబిన్ ఊతప్పలతో రాజస్థాన్ బ్యాటింగ్ ఫర్వాలేదనిపిస్తోంది.

 మరోపక్క, దేవదత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లీర్స్, శివం దూబేలతో కూడిన బెంగళూరు బ్యాటింగ్ లైనప్ దే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. అయితే క్రికెట్ లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో పిచ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం ఈ పోరుకు వేదికగా నిలుస్తోంది.

బెంగళూరు జట్టులో సైనీ, ఉదన, జంపా, చాహల్, వాషింగ్టన్ సుందర్... రాజస్థాన్ జట్టులో జోఫ్రా ఆర్చర్, ఉనద్కట్, టామ్ కరన్ వంటి బౌలర్లు ఉండడంతో బ్యాట్ కు, బంతికి మధ్య ఆసక్తికర పోరు తప్పదనిపిస్తోంది. ఇక, ఈ మ్యాచ్ ద్వారా రాజస్థాన్ ఆల్ రౌండర్ 20 ఏళ్ల మహిపాల్ లొమ్రోర్ జట్టులోకి వచ్చాడు.


More Telugu News