మళ్లీ ఓడిన ధోనీ సేన.. వార్నర్ సేనదే పైచేయి!

  • టీ20లోని అసలైన మెరుపులు మాయం
  • చప్పగా సాగిన ఇరు జట్ల ఇన్నింగ్స్
  • చెన్నై హ్యాట్రిక్ పరాజయం
ఐపీఎల్‌లో భాగంగా గత రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. హైదరాబాద్‌కు ఇది వరుసగా రెండో విజయం. రాయుడు తిరిగి జట్టులోకి రావడంతో మంచి ఊపుమీద ఉన్నట్టు కనిపించిన చెన్నై జట్టు ఓ మాదిరి లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిల పడింది. వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసిన ధోనీ సేన పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

హైదరాబాద్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని అందుకునేందుకు బరిలోకి దిగిన చెన్నైకి ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నాలుగు పరుగుల వద్ద ఓపెనర్ షేన్ వాట్సన్ (1) భువనేశ్వర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వాట్సన్ అవుట్‌తో ప్రారంభమైన వికెట్ల పతనం ఆ తర్వాత కూడా కొనసాగింది. హైదరాబాద్ బౌలర్ల దెబ్బకు చెన్నై టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఆదుకుంటాడనుకున్న రాయుడు (8), కేదార్ జాదవ్ (3) ఒకరి తర్వాత ఒకరు వెనుదిరిగారు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ ఆచితూచి ఆడాడు. భారీ షాట్లకు పోకుండా ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అతడికి రవీంద్ర జడేజా చక్కని సహకారం అందించాడు. వికెట్లు పడిపోకుండా వీరి భాగస్వామ్యం అడ్డుకట్ట వేసినప్పటికీ సాధించాల్సిన పరుగులు, బంతులకు మధ్య వ్యత్యాసం పెరిగిపోతుండడంతో ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో రవీంద్ర జడేజా జోరు పెంచాడు. 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధ సెంచరీ (50) పూర్తి చేసుకున్నాక నటరాజన్ బౌలింగులో అబ్దుల్ సమద్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

మరోవైపు, క్రీజులో ధోనీ నిలదొక్కుకున్నప్పటికీ ఎటువంటి మెరుపులు లేకపోవడంతో ఇన్నింగ్స్ చప్పగా సాగింది. 36 బంతులు ఎదుర్కొన్న ధోనీ 4 ఫోర్లు, సిక్సర్‌తో 47 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో శామ్ కరన్ 5 బంతుల్లో రెండు సిక్సర్లతో ఊపు తెచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 20 ఓవర్లలో చెన్నై 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసి విజయం ముంగిట బోల్తాపడింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ బ్యాటింగ్ కూడా పేలవంగా సాగింది. ఒక్క పరుగు వద్ద ఓపెనర్ బెయిర్‌‌స్టో (1) దీపక్ చాహర్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో జాగ్రత్త పడిన హైదరాబాద్ షాట్ల జోలికి పోకుండా సంయమనంతో ఆడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేసింది. కెప్టెన్ వార్నర్ 28 (29 బంతుల్లో 3 ఫోర్లు), మనీష్ పాండే 29(21 బంతుల్లో 5 ఫోర్లు) పరుగులు చేసి అవుటయ్యారు.

దీంతో కష్టాల్లో పడిన జట్టును ఆదుకుంటాడనుకున్న విలియమ్సన్ 9 పరుగులు మాత్రమే చేసి రనౌట్ కావడంతో జట్టు స్కోరు 140 దాటితే అదే గొప్ప అనుకున్నారు. అయితే, చివర్లో కుర్రాళ్లు ప్రియం గార్గ్, అభిషేక్ శర్మలు మ్యాచ్‌కు ఊపు తెచ్చారు. దీంతో అప్పటి వరకు నత్తనడకన సాగిన స్కోరు పరుగందుకుంది. గార్గ్ 26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 51 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 24 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 31 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. అర్ధ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రియం గార్గ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.


More Telugu News