కరోనా మహిమ... ఈ ఏడాది బాగా పెరిగిన ఐపీఎల్ వీక్షణల సంఖ్య

  • స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతి లేని వైనం
  • లాక్ డౌన్ పరిస్థితులతో ఇళ్లకే పరిమితమైన ప్రజలు
  • టీవీలు, ఇతర పరికరాల ద్వారా ఐపీఎల్ మ్యాచ్ ల వీక్షణ
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్టేడియంలకు వెళ్లే వీల్లేకపోవడంతో  ఐపీఎల్ మ్యాచ్ లను టీవీల్లోనూ, ఐప్యాడ్లు, ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్లలో చూస్తున్నారు. తద్వారా గతేడాదితో పోల్చితే ఈ సీజన్ లో ఐపీఎల్ వీక్షణల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2019 సీజన్ మొదటివారంతో పోల్చితే తాజా సీజన్ మొదటి వారంలో 15 శాతం పెరుగుదల నమోదైంది. 60.6 బిలియన్ల నిమిషాల పాటు ఐపీఎల్ వీక్షించారని టీవీ వ్యూస్ మదింపు సంస్థ బీఏఆర్సీ వెల్లడించింది.

ప్రతిమ్యాచ్ కు 39 మిలియన్ల ఇంప్రెషన్లు రాగా, గతేడాదితో పోల్చితే ఆ సగటు 21 శాతం పెరిగింది. వీక్షణల్లో ఈ వృద్ధి కరోనా వ్యాప్తి ఫలితంగానే సాధ్యమైందని చెప్పాలి. ప్రేక్షకులు స్టేడియంలకు వెళ్లేందుకు అనుమతి లేకపోవడం, లాక్ డౌన్ల కారణంగా చాలావరకు ఇంటికే పరిమితం కావడంతో టీవీల్లో మ్యాచ్ లు చూసేవారి సంఖ్య మొదటివారంలో బాగా పెరిగిందని బీఏఆర్సీ వివరించింది. దానికితోడు అరగంట ముందే మ్యాచ్ లు మొదలవుతుండడం కూడా ఓ కారణమని తెలిపింది.

ఈ ఐపీఎల్ 13వ సీజన్ లో మొదటివారం మొత్తమ్మీద  269 మిలియన్ల మంది మ్యాచ్ లు వీక్షించారు. సెప్టెంబరు 19న జరిగిన ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడగా, 158 మిలియన్ల మంది మ్యాచ్ చూశారు. 2019 ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ తో పోల్చితే ఇది 21 శాతం ఎక్కువ.


More Telugu News