ఏమీ లేని స్థితి నుంచి వచ్చిన కేసీఆర్.. త్వరలోనే అంబానీ కంటే ధనికుడు అయిపోతారు: మాణికం ఠాగూర్

  • ఇప్పటికే కేసీఆర్ అత్యంత ధనికుడు అయ్యారు
  • కమిషన్లు తీసుకుంటూ వెనకేసుకుంటున్నారు
  • కేసీఆర్ పాలనతో తెలంగాణ నాశనమైంది
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జి మాణికం ఠాగూర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏమీ లేని స్థితి నుంచి కేసీఆర్ వచ్చారని.. పదవిని అడ్డు పెట్టుకుని ఇప్పటికే అత్యంత ధనికుడు అయ్యారని... రానున్న రోజుల్లో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీని కూడా మించిపోతారని అన్నారు.

ముఖేష్ అంబానీ వ్యాపారం చేస్తూ సంపాదిస్తుంటే... కేసీఆర్ కమిషన్లు తీసుకుంటూ వెనకేసుకుంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిని కల్వకుంట్ల చంద్రశేఖర్ అని కాకుండా... కమిషన్ చంద్రశేఖర్ అని పిలుద్దామని అన్నారు. తెలంగాణలోని అధికారం మొత్తం కేసీఆర్, ఆయన కొడుకు, కుమార్తె, అల్లుడి చేతిలోనే ఉందని విమర్శించారు.

తెలంగాణలోని ప్రతి వ్యక్తికి మేలు జరగాలనే ఉద్దేశంతో సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని.. అయితే, ఆమె కోరిక నెరవేరలేదని ఠాగూర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అతలాకుతలం అయిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాన్ని నిరసిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 ఈ సందర్బంగా ఠాగూర్ మాట్లాడుతూ, ఇది ఇందిరమ్మ నామినేషన్ వేసిన చోటు అని... అందుకే రాష్ట్ర ఇన్చార్జిగా ఇక్కడి నుంచే కార్యకలాపాలను మొదలుపెట్టానని చెప్పారు. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతోనే తనను ఇక్కడకు పంపించారని... అదే లక్ష్యంతో మనమంతా ముందుకు వెళదామని అన్నారు.


More Telugu News