మహా సంకీర్ణంలో లుకలుకలు నిజమే.. కాంగ్రెస్ తో విభేదాలు ఉన్నాయన్న శివసేన!

  • కాంగ్రెస్ తో విభేదాలున్నాయని స్పష్టం చేసిన సంజయ్ రౌత్
  • రాహుల్ పట్ల యూపీ పోలీసుల తీరును తప్పుపట్టిన సంజయ్
  • రాహుల్ ఒక జాతీయ స్థాయి నేత అని వ్యాఖ్య
మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సైద్ధాంతికంగా విభిన్న భావాలు కలిగిన ఈ పార్టీలు ఎంతకాలం కలసికట్టుగా కొనసాగుతాయనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో శివసేన కీలక నేత సంజయ్ రౌత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో తమకు విభేదాలు ఉన్నాయని ఒప్పుకున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో యూపీ పోలీసులు వ్యవహరించిన తీరుపై సంజయ్ రౌత్ స్పందిస్తూ... పోలీసుల తీరు ఏమాత్రం బాగోలేదని అన్నారు.

కాంగ్రెస్ తో తమకు విభేదాలున్నప్పటికీ... రాహుల్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తాము కచ్చితంగా తప్పుబడతామని సంజయ్ చెప్పారు. యూపీలో స్థానికంగా ఉన్న శాంతిభద్రతల సమస్యను తాము అర్థం చేసుకోగలమని... అయితే ఓ జాతీయ స్థాయి నేతతో వ్యవహరించిన తీరు అభ్యంతరకరమని అన్నారు.

రాహుల్ గాంధీ ఒక జాతీయ స్థాయి నాయకుడని... ఓ బాధిత కుటుంబాన్ని కలిసేందుకు వెళ్తున్నారని... ఆయనను మధ్యలో ఆపాల్సిన అవసరం ఏముందని సంజయ్ మండిపడ్డారు. రాహుల్ కాలర్ పట్టుకుని, కిందకు తోసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత జరుగుతున్నా ఆపే ప్రయత్నం ఎవరూ చేయలేదని అన్నారు. ఒక ప్రధానికి మునిమనవడు, మరో ప్రధానికి మనవడు, ఇంకో ప్రధానికి కుమారుడు అయిన వ్యక్తి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ తో శివసేనకు విభేదాలున్నట్టు ఆయన ఒప్పుకోవడం గమనార్హం.


More Telugu News