ఓటమి చాలా నిరాశ పర్చింది: పంజాబ్‌ సారథి రాహుల్‌

  • పంజాబ్‌పై నిన్న ముంబై విజయం
  • పొరపాట్లు చేశామన్న రాహుల్
  • తాము పుంజుకోవాల్సి ఉందని వ్యాఖ్య
  • ఐపీఎల్‌లో మయాంక్‌ కంటే ఎక్కువ పరుగులు చేస్తానని ధీమా
నిన్న రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ ఓటమి తనను నిరాశపరిచిందని పంజాబ్‌ సారథి కేఎల్‌ రాహుల్‌ చెప్పాడు. ఈ మ్యాచులో తాము పొరపాట్లు చేశామని, ఓటముల నుంచి తాము త్వరగా తేరుకొని  పుంజుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించాడు.

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన వారికి ఇచ్చే టోపీని త్వరలోనే తాను మయాంక్‌ నుంచి తీసుకుంటానని అన్నాడు. కొత్త బంతితో ఆడుతున్నప్పుడు  చక్కగా అనిపించిందని, తొలి ఇన్నింగ్స్‌ అనంతరం పిచ్‌ నెమ్మదించిందేమోనని అన్నాడు. ఆల్‌రౌండర్‌ జట్టులో ఉంటే బాగుంటుందని, అదనపు బౌలర్‌ లేదా ఆల్‌రౌండర్‌ను తీసుకోవడంపై కోచ్‌లతో మాట్లాడాక నిర్ణయిస్తామని తెలిపాడు. కాగా, ఐపీఎల్‌లో ఇప్పటివరకు 246 పరుగులతో మయాంక్‌ అగర్వాల్ బ్యాట్స్‌మెన్‌లో ముందంజలో ఉండడంతో  అత్యధిక పరుగులు చేసేవారికిచ్చే టోపీ  ప్రస్తుతం ఆయన వద్ద ఉంది. ఆ తర్వాతి స్థానంలో 239 పరుగులతో రాహుల్‌ ఉన్నాడు.


More Telugu News