రాహుల్, ప్రియాంకలపై యూపీ పోలీసుల కేసు!

  • చట్ట నిబంధనలను ఉల్లంఘించారు
  • మరో 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలపైనా కేసు
  • రాహుల్, ప్రియాంకలను వారించినా వినలేదన్న అధికారులు
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. మహమ్మారి చట్టం నిబంధనలను వారిద్దరూ ఉల్లంఘించారని పోలీసులు కేసును రిజిస్టర్ చేయడం గమనార్హం. కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్న వేళ, వీరిద్దరూ వాటిని ఉల్లంఘించారంటూ గౌతమ్ బుద్ధ నగర్ లో పోలీసులు కేసును రిజిస్టర్ చేశారు. వీరిద్దరితో పాటు మరో 150 మంది వరకూ కార్మికుల పేర్లనూ పోలీసులు చేర్చారు.

హత్రాస్ లో జరిగిన దారుణమైన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీయగా, కాంగ్రెస్ నేతలు ఇద్దరూ, నిరసనలను తెలుపుతూ, బాధితురాలి కుటుంబీకులను పరామర్శించేందుకు హత్రాస్ బయలుదేరారు. వీరిద్దరినీ సరిహద్దుల్లోనే పోలీసులు నిలువరించిన వేళ, తోపులాటలో రాహుల్ కింద పడిపోయిన సంగతి తెలిసిందే.

అయితే, హత్రాస్ ప్రాంతంలో కరోనా కేసులు అధికంగా ఉన్నాయని, అందువల్లే జిల్లా పరిధిలో బారికేడ్లను ఏర్పాటు చేశామని పోలీసు అధికారులు అంటుండడం గమనార్హం. ఇదే జిల్లాలో పలువురు ప్రభుత్వ అధికారులు కూడా కరోనా బారిన పడ్డారని, ఆ ప్రాంతంలోకి వెళ్లవద్దని రాహుల్, ప్రియాంకలను ఎంతగా వారించినా వారు వినలేదని కేసు పెట్టారు. నిన్న మధ్యాహ్నం తరువాత జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఈ కేసు రిజిస్టర్ కావడం గమనార్హం.


More Telugu News