బాలకార్మికులకు సంబంధించిన కేసులలో మొదటి స్థానంలో తెలంగాణ

  • గతేడాది తెలంగాణలో 314 బాలకార్మిక కేసుల నమోదు
  • బాలికలపై లైంగిక వేధింపులు కూడా ఎక్కువే
  • కల్తీ పాలు, ఆహారం విషయంలో ఏపీ టాప్
బాలకార్మిక వ్యవస్థలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది దేశవ్యాప్తంగా బాలకార్మికులకు సంబంధించి 770 కేసులు నమోదు కాగా, అందులో ఒక్క తెలంగాణలో 314 కేసులు ఉండడం గమనార్హం. వీటిలో హైదరాబాద్‌లో నమోదైన కేసుల సంఖ్య 21. అలాగే, 459 మందికి ఈ కూపం నుంచి విముక్తి కల్పించారు.

 తెలంగాణ తర్వాతి స్థానంలో వరుసగా కర్ణాటక (83), అసోం (68), గుజరాత్ (64) ఉన్నట్టు క్రైమ్ ఇన్ ఇండియా -2019 నివేదిక ద్వారా తెలుస్తోంది. జాతీయ నేరాల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నిన్న ఈ నివేదికను విడుదల చేసింది. దీనిని బట్టి తెలంగాణలో 2,560  బాలల సంబంధిత కేసులు నమోదయ్యాయి. అలాగే, 2,787 మంది మొత్తం బాధితులున్నారు. గతేడాది 35 బాల్య వివాహాలను అడ్డుకుని కేసులు నమోదు చేశారు.  

ఇక, తెలంగాణలో బాలికలపై లైంగిక వేధింపులు కూడా పెరుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది. 2019లో 2,011 మంది బాలికలు వేధింపులకు గురికాగా, 1,998 మందిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. అలాగే, వరకట్న నిరోధక చట్టం కింద గతేడాది ఏపీలో 472 కేసులు నమోదు కాగా, తెలంగాణలో ఆరు కేసులు మాత్రమే వెలుగు చూశాయి. అలాగే, అసహజ లైంగిక వేధింపులకు సంబంధించి 10 కేసులు నమోదయ్యాయి.  

పెళ్లి కోసం యువతులను కిడ్నాప్ చేసిన ఘటనలు 393 జరగ్గా, పని ప్రదేశాలతో పాటు రోడ్లపైన, సోషల్ మీడియాలో ప్రేమ, పెళ్లి పేరుతో యువతులను వేధించే ఘటనలు రాష్ట్రంలో పెరిగాయి. ఈ విషయంలో 2,161 కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, 1,204 కేసులతో తెలంగాణ రెండోస్థానంలో ఉంది. రాష్ట్రంలో 5,559 నిబంధనల ఉల్లంఘన (ట్రెస్‌పాస్) కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ (6,604) ముందుంది. తప్పుడు వార్తల వ్యాప్తి విషయంలో తెలంగాణలో 47 కేసులు నమోదు కాగా, 60 మందిని అరెస్ట్ చేశారు. గతేడాది 67 మతపరమైన కేసులు నమోదయ్యాయి.

కల్తీపాలు, ఆహార పదార్థాలకు సంబంధించి 1,490 కేసులతో ఏపీ అగ్రస్థానంలో ఉండగా, 1,186 కేసులతో తెలంగాణ ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఇక చీటింగ్ కేసుల విషయంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 9,233 కేసులు నమోదయ్యాయి. ఈ జాబితాలో రాజస్థాన్‌ (17,160) అగ్రస్థానంలో ఉంది. గతేడాది తెలంగాణలో 839 హత్యలు జరిగాయి. వీరిలో 26 మంది ఆరేళ్లలోపు చిన్నారులు ఉండడం గమనార్హం.


More Telugu News