ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ముంబై.. పంజాబ్ చిత్తు

  • పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరిన ముంబై 
  • చివర్లో బంతిని ఎడాపెడా బాదిన పొలార్డ్
  • బౌలర్ల ముందు చేతులెత్తేసిన పంజాబ్
ఆల్‌రౌండ్ షోతో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. నిన్న రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (70), పొలార్డ్ (47 నాటౌట్), హార్దిక్ పాండ్యా (30 నాటౌట్)లు చెలరేగిపోయారు. వీరి దెబ్బకు పంజాబ్ బౌలింగ్ కకావికలమైంది. తొలుత కట్టడి చేసిన బౌలర్లు చివర్లో చేతులెత్తేసి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఫలితంగా ముంబై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 191 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా అడుగులు వేయలేకపోయింది. ముంబై బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు సంధిస్తూ బ్యాట్స్‌మెన్‌ను వణికించారు. దీంతో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది.

మంచి ఫామ్‌లో ఉన్న పంజాబ్ కెప్టెన్ లోకేశ్ రాహుల్ (17), మాయంక్ అగర్వాల్ (25) ఈసారి తీవ్రంగా నిరాశ పరిచారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కరుణ్ నాయర్ డకౌట్ అయ్యాడు. నికోలస్ పూరన్ (27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 పరుగులు) జట్టు భారాన్ని తనపై వేసుకుని స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. మరోవైపు, క్రీజులో ఉన్న మ్యాక్స్‌వెల్ నుంచి ఆశించిన స్థాయి బ్యాటింగ్ లేకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. 18 బంతులు ఆడి ఒక్క ఫోర్ కూడా లేకుండానే 11 పరుగులు చేసి అవుటయ్యాడు.

చివరి 5 ఓవర్లలో విజయానికి 83 పరుగులు చేయాల్సి రావడం, ముంబై బౌలర్ల ముందు బ్యాట్స్‌మెన్ నిలబడలేకపోతుండడంతో పరాజయం ఖాయమైంది. చివర్లో కృష్ణప్ప గౌతమ్ 13 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 22 పరుగులు చేసినప్పటికీ ఆ స్కోరు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పనికొచ్చింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైన పంజాబ్ 48 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముంబై బౌలర్లలో జేమ్స్ పాటిన్సన్, బుమ్రా, రాహుల్ చాహర్‌లు రెండేసి వికెట్లు తీసుకున్నారు. ట్రెంట్ బౌల్ట్, కృనాల్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు. 20 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన పొలార్డ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.


More Telugu News