కరోనా సంక్షోభ సమయంలోనూ హైదరాబాద్ గ్లోబల్ సంస్థలను ఆకర్షిస్తోంది: కేటీఆర్

  • హైదరాబాద్ వైపు చూస్తున్న గోల్డ్ మన్ సాక్స్
  • సంతోషం వ్యక్తం చేసిన కేటీఆర్
  • హైదరాబాద్ ఘనత మరోసారి నిరూపితమైందంటూ ట్వీట్
హైదరాబాదులో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్, ఆర్థిక వ్యవహారాల సంస్థ గోల్డ్ మన్ సాక్స్ ఆసక్తి చూపిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రపంచంలోని అగ్రగామి ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకుల్లో ఒకటైన గోల్డ్ మన్ సాక్స్ ను హైదరాబాదుకు ఆహ్వానించేందుకు ఎంతో సంతోషిస్తున్నామని తెలిపారు.

తమ పెట్టుబడుల గమ్యస్థానంగా హైదరాబాదును ఎన్నుకున్నందుకు గోల్డ్ మన్ సాక్స్ ఇండియా చైర్మన్ సంజయ్ చటర్జీ,  ఎండీ-ఇండియా హెడ్  గుంజన్ సమ్తానీ, ఎండీ-చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రవి కృష్ణన్ లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు.

కరోనా వంటి మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనూ అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తూ హైదరాబాద్ తన ఘనతను కొనసాగిస్తోందని తెలిపారు. పోటీ పరంగా ఎంతో ఆధిక్యతను కొనసాగిస్తోన్న నగరంగా హైదరాబాద్ స్థానం మరోసారి నిరూపితమైందని వివరించారు. ఇప్పటికే బలమైన ఆర్థిక సాంకేతిక వ్యవస్థ ఉన్న హైదరాబాదు నగరం గోల్డ్ మన్ సాక్స్ రాకతో మరింత వృద్ధిలోకి వస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.


More Telugu News