25 మంది నర్సరీ విద్యార్థులకు విషమిచ్చిన ఉపాధ్యాయురాలు.. మరణశిక్ష విధించిన చైనా

  • విద్యార్థులను ఎలా తీర్చిదిద్దాలన్న అంశంపై గొడవ
  • విద్యార్థులకు ఇచ్చే గంజిలాంటి పదార్థంలో విషం కలిపిన టీచర్
  • మూడేళ్ల క్రితం తన భర్తపైనా ఇలాంటి ప్రయోగమే చేసిన వైనం
తోటి ఉపాధ్యాయురాలి మీద ఉన్న కోపంతో 25 మంది విద్యార్థులకు విషమిచ్చి, వారిలో ఒకరి చావుకు కారణమైన కిండర్‌గార్టెన్ ఉపాధ్యాయురాలికి చైనా కోర్టు మరణశిక్ష విధించింది. నర్సరీ విద్యార్థులను తీర్చిదిద్దే విషయమై గతేడాది జియాజూలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు టీచర్ల మధ్య గొడవ జరిగింది.

దీంతో పగతో రగిలిపోయిన ఓ టీచర్ పాఠశాలలో విద్యార్థులకు అందించే గంజిలాంటి పదార్థంలో విషపూరిత రసాయాన్ని కలిపి తన కోపాన్ని అలా చల్లార్చుకుంది. విషం కలిపిన గంజి తాగిన 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా, వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా తోటి ఉపాధ్యాయురాలితో గొడవ నేపథ్యంలో వాంగ్ యున్ అనే టీచర్ ఆన్‌లైన్‌లో సోడియం నైట్రేట్ అనే విషపూరిత రసాయనాన్ని తెప్పించి దానిని తీసుకొచ్చి పాఠశాల గంజిలో కలిపినట్టు తేలింది. అంతేకాదు, ఫిబ్రవరి 2017లో తన భర్తపైనా ఇలాంటి ప్రయోగమే చేసిందని, అయితే అతడు బతికి బయటపడ్డాడని తేలింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తాజాగా, వాంగ్‌కు హెనాన్ ప్రావిన్స్ కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.


More Telugu News