మాణికం ఠాగూర్ నాకు వార్నింగ్ ఇచ్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు: జగ్గారెడ్డి

  • హైదరాబాదుకు వచ్చిన మాణికం ఠాగూర్ నియామకం
  • పార్టీ కార్యకలాపాల్లో వేగం పెంచిన ఠాగూర్
  • ఠాగూర్ తో భేటీ సంతృప్తికరంగా జరిగిందన్న జగ్గారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మాణికం ఠాగూర్ ఇటీవలే నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు అందుకున్న వెంటనే హైదరాబాదుకు వచ్చి రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ తనదైన ముద్రవేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, మాణికం ఠాగూర్ తనకు వార్నింగ్ ఇచ్చినట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజంలేదని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో ఈవిధంగా ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఇన్చార్జి ఠాగూర్ తో సమావేశం సంతృప్తికరంగా సాగిందని జగ్గారెడ్డి వెల్లడించారు. ఠాగూర్ నిర్ణయాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు.

కాగా, టీపీసీసీ కోర్ కమిటీ సమావేశం, దుబ్బాక ఉప ఎన్నిక అంశంపై భేటీకి జగ్గారెడ్డి రాకపోవడం పట్ల ఠాగూర్ అసంతృప్తితో ఉన్నాడని, జగ్గారెడ్డి నుంచి వివరణ కోరారని ఇప్పటికే మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, వ్యక్తిగత కారణాలతోనే ఆ సమావేశాలకు రాలేకపోయానని జగ్గారెడ్డి సంజాయిషీ ఇచ్చుకున్నట్టు తెలుస్తోంది.


More Telugu News