రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగ బాబాలు... హోమం పేరిట లక్షలు మాయం!

  • భయపెడుతూ డబ్బులు దండుకుంటున్న దొంగ బాబాలు
  • ఓ గ్రామంలో రూ.6 లక్షలు వసూలు
  • ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
ప్రజల నమ్మకాలు, బలహీనతలను ఆసరాగా చేసుకుని పబ్బం గడుపుకునేవాళ్లకు కొదవలేదు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగ బాబాలు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని, హోమం పేరిట వారి నుంచి లక్షల రూపాయలు పిండుకుంటున్నారు. డబ్బు చేతిలో పడగానే మటుమాయం అవుతున్నారు. ఎల్లారెడ్డి పేట మండలంలో గత కొన్నిరోజులుగా నకిలీ బాబాల బెడద తీవ్రమైంది.

ఒంటరిగా ఉండే మహిళలను గుర్తించి, వారి ఇళ్లలోకి ప్రవేశించి మీ ఇంటిలో మృత్యుదేవత ఆవహించింది... హోమం చేయకపోతే మీ ఇంటి పెద్ద మరణిస్తాడు అంటూ వారిని భయపెడతారు. వారు తమ దారిలోకి వచ్చారని తెలియగానే, కొబ్బరికాయ, కొన్ని నిమ్మకాయలతో ఓ తంతు ముగించి, భారీగా డబ్బు తీసుకుని అక్కడ్నించి ఉడాయిస్తున్నారు. ఓ మహిళ ఈ దోపిడీ బాబాల మాటలు నమ్మక భర్తకు ఫోన్ చేయడంతో ఆమె ముఖంపై నీళ్లు చల్లి భయాందోళనలకు గురిచేసిన సంఘటన కూడా చోటుచేసుకుంది.

గొల్లపల్లిలో ఓ వ్యాపారికి ధనయంత్రం పేరిట ఆశచూపి అతడి నుంచి రూ.1.5 లక్షలు గుంజారు. వ్యాపారంలో నష్టాలు వస్తాయని, కొత్త ఇంటికి శాంతి చేయాలని... ఇలా అనేక విధాలుగా ప్రజలను భయపెట్టి ఒక్క గొల్లపల్లి గ్రామంలోనే రూ.6 లక్షల వరకు రాబట్టారు. కొందరు గ్రామస్తులు వీరిని నిలదీస్తే, తమకు పోలీసు అధికారులు తెలుసంటూ బెదిరించారు. ఈ విషయాన్ని మీడియా పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది.

ఎల్లారెడ్డి పేట సీఐ బన్సీలాల్ దీనిపై మాట్లాడుతూ, దొంగ బాబాల విషయమై ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అపరిచితుల మాటలు నమ్మి మోసపోవద్దని స్పష్టం చేశారు.


More Telugu News