విజయవాడలో చేనేత ప్రాంతీయ కార్యాలయాన్ని పునరుద్ధరించాలి: స్మృతీ ఇరానీకి లోకేశ్ లేఖ

  • విజయవాడలో బ్రాంచ్ స్థాయికి తగ్గిన చేనేత కార్యాలయం
  • హైదరాబాదు ప్రాంతీయ కార్యాలయానికి ఇదే పరిస్థితి
  • కిషన్ రెడ్డి జోక్యంతో పునరుద్ధరించారన్న లోకేశ్
  • విజయవాడ విషయంలో కేంద్రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీకి లేఖ రాశారు. జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడ కేంద్రంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. చేనేత ఆదాయంలో స్థిరమైన పెరుగుదలకు కారణమైన బ్రాంచ్ కార్యాలయం ప్రాంతీయ కార్యాలయంగా అభివృద్ధి చెందిందని వివరించారు. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం స్థాయిని బ్రాంచ్ కార్యాలయంగా కుదించినప్పటికీ మంత్రి కిషన్ రెడ్డి జోక్యంతో ప్రాంతీయ కార్యాలయంగా కొనసాగించేందుకు కేంద్రం అంగీకరించిందని లోకేశ్ వెల్లడించారు. అలాగే విజయవాడ ప్రాంతీయ కార్యాలయం స్థాయిని కూడా పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నానని తన లేఖలో పేర్కొన్నారు.

చేనేత రంగం వేళ్లూనుకుని ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటని, 3 లక్షల మంది చేనేత కార్మిక కుటుంబాలతో దక్షిణాదిన ఏపీ రెండో స్థానంలో ఉందని లోకేశ్ తెలిపారు. విజయవాడలో మొదట బ్రాంచ్ ఆఫీసు ఏర్పాటు చేశారని, చేనేత ఆదాయంలో స్థిర అభివృద్ధి కనబర్చడంతో పాటు రూ.65 కోట్ల నుంచి రూ.80 కోట్ల టర్నోవర్ వస్తుండేదని, దాంతో విజయవాడలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేశారని వివరించారు.

తద్వారా హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయానికి ఇక్కడి నుంచి నివేదికలు పంపాల్సిన అవసరం తగ్గిపోయిందని, అనుమతుల కోసం హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపే శ్రమ తొలగిపోయిందని తెలిపారు. తద్వారా ఎంతో సమయం ఆదా అయ్యేదని పేర్కొన్నారు. ఇటీవలే హైదరాబాద్ లో ప్రాంతీయ కార్యాలయాన్ని బ్రాంచ్ ఆఫీసు స్థాయికి తగ్గిస్తే, తెలంగాణ చేనేత సంఘాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశాయని, ఆయన జోక్యంతో తిరిగి హైదరాబాదులో చేనేత ప్రాంతీయ కార్యాలయాన్ని పునరుద్ధరించారని లోకేశ్ వెల్లడించారు.

తెలంగాణలో చేనేతపై టర్నోవర్ రూ.14 కోట్ల నుంచి రూ.16 కోట్ల వరకు వచ్చేదని తెలిపారు. అయితే, ఏపీలో అంతకంటే ఎక్కువ టర్నోవర్ వస్తున్నా, విజయవాడ ప్రాంతీయ కార్యాలయాన్ని బ్రాంచ్ కార్యాలయం స్థాయికి తగ్గించారని, దీనిపై కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని లోకేశ్ కేంద్ర జౌళి మంత్రి స్మృతీ ఇరానీని కోరారు.


More Telugu News