కుటుంబ పెన్షన్ నిబంధనల్లో మార్పులు.. విడాకుల పిటిషన్ పెండింగ్‌లో ఉన్నా కుమార్తెకు పింఛన్

  • ఇప్పటి వరకు విడాకులు పొందిన వారికి మాత్రమే ఈ వెసులుబాటు
  • విడాకుల పిటిషన్ దాఖలు చేసినా పెన్షన్ వర్తిస్తుందన్న మంత్రి
  • అడెండెంట్ అలవెన్సు రూ. 6,700కు పెంపు
కుటుంబ పింఛన్ నియమనిబంధనల్లో కేంద్రం స్వల్ప మార్పు చేసింది. దీని ప్రకారం తల్లిదండ్రులు బతికున్న కాలంలో విడాకుల కోసం కుమార్తె దాఖలు చేసిన పిటిషన్ పెండింగులో ఉన్నప్పటికీ వారికి కూడా ఇకపై తల్లిదండ్రుల పింఛన్ లభించనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. ఇప్పటి వరకు తల్లిదండ్రులు జీవించి ఉన్న కాలంలో అధికారికంగా విడాకులు పొందిన కుమార్తెలు మాత్రమే ఉద్యోగి/పింఛన్‌ లబ్ధిదారు అయిన తల్లిదండ్రుల పింఛన్ పొందేందుకు అర్హులు. ఇప్పుడు ఈ నిబంధనను సవరించి విడాకులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వారు కూడా పెన్షన్‌కు అర్హులేనని మంత్రి తెలిపారు.

విడాకులు అధికారికంగా మంజూరు కాకున్నా పెన్షన్ లబ్ధిదారులైన తల్లిదండ్రులు బతికున్న కాలంలో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసి ఉంటే సరిపోతుందని మంత్రి వివరించారు. తల్లిదండ్రుల మరణానికి ముందు దివ్యాంగులైన పిల్లలు.. తల్లిదండ్రుల మరణం తర్వాత దివ్యాంగ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే వారికి కుటుంబ పెన్షన్ లభిస్తుందన్నారు. అయితే, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మాత్రం వైకల్యం ప్రాప్తిస్తే మాత్రం ఇది వర్తించదన్నారు. కాగా, దివ్యాంగ పెన్షనర్ల సహాయకులకు ఇచ్చే అటెండెంట్ అలవెన్సును రూ. 4500 నుంచి రూ. 6700కు పెంచినట్టు జితేంద్రసింగ్ తెలిపారు.


More Telugu News