ఢిల్లీని తాకిన రైతు నిరసనలు... ఇండియా గేట్ వద్ద ట్రాక్టర్ దగ్ధంతో తీవ్ర ఉద్రిక్తత!

  • దూసుకొచ్చి ధర్నాకు దిగిన 20 మంది రైతులు
  • ట్రాక్టర్ కు అంటుకున్న మంటలను ఆర్పిన ఫైర్ సిబ్బంది
  • ధర్నాలో పాల్గొన్న వారిని గుర్తించే పనిలో పోలీసులు
కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, రైతులు చేస్తున్న నిరసనలు ఈ ఉదయం హస్తినను తాకాయి. నిత్యమూ అత్యంత రద్దీగా, భద్రతా దళాల నిఘా అత్యధికంగా ఉండే ఇండియా గేట్ సమీపానికి వచ్చిన రైతులు, అక్కడే ఓ ట్రాక్టర్ ను దగ్ధం చేయడంతో కలకలం రేపింది. ఆ వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ తదితరాలు ఉండే సెంట్రల్ ఢిల్లీ ప్రాంతానికి ఈ ఉదయం 7.15 నుంచి 7.30 గంటల మధ్య వచ్చిన దాదాపు 20 మంది రైతులు అక్కడే కూర్చుని ధర్నాకు దిగారు. చేతిలో భగత్ సింగ్ చిత్ర పటాన్ని పట్టుకుని, వారు ప్రభుత్వ వ్యతిరేక, కాంగ్రెస్ అనుకూల నినాదాలు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ఈ ఘటనలో ఎవరెవరు పాల్గొన్నారన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు.

కాగా, వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించినప్పటి నుంచి ఉత్తర భారతావని అట్టుడుకుతోంది. అమృత సర్ - న్యూఢిల్లీ రైల్వే ట్రాక్ పైకి చేరుకున్న వందలాది మంది రైతులు, ధర్నాకు దిగగా, ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. గత బుధవారం నుంచి కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నేతృత్వంలో రైల్ రోకో జరుగుతోంది. ఇదిలావుంచితే, ఈ బిల్లులకు రాష్ట్రపతి నిన్న ఆమోదముద్ర వేయడంతో చట్టంగా మారాయి.


More Telugu News