వర్షాల నుంచి ఊరట.. మరో 24 గంటల్లో వెనక్కి వెళ్లనున్న నైరుతి రుతుపవనాలు

  • జూన్ రెండో వారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు
  • తెలంగాణలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు
  • నేడు రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ మొదలు
జూన్ రెండో వారంలో తెలంగాణలో అడుగుపెట్టిన నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదైంది. ఈసారి భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు నిండుకుండల్లా మారాయి.

మూడున్నర నెలలపాటు ప్రభావాన్ని చూపిన నైరుతి రుతుపవనాలు వెనక్కి వెళ్లే సమయం వచ్చేసిందని, మరో 24 గంటల్లో రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ మొదలు కానుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపసంహరణ ప్రక్రియకు ప్రస్తుతం అనుకూల పరిస్థితులు ఉన్నాయని, నేడు ఇవి పశ్చిమ రాజస్థాన్, పరిసర ప్రాంతాల్లో నిష్క్రమించే అవకాశం ఉందని పేర్కొంది.

ఇక ఈసారి రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఆగస్టు, సెప్టెంబరులలో సాధారణ వర్షపాతం కంటే రెట్టింపు వానలు కురిశాయి. ఫలితంగా ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. 70.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈసారి రికార్డు స్థాయిలో 107 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గతేడాది ఇదే సీజన్‌లో 77.6 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.

మరోవైపు, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు.


More Telugu News