పదేళ్ల తరువాత నిండిన గండిపేట జలాశయం... ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం!

  • జంట నగరాలకు మంచి నీరిచ్చే జలాశయాలు
  • మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం
  • లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు తాగు నీటి అవసరాలను తీర్చే గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు పదేళ్ల తరువాత నిండుకుండలా మారాయి. ఇటీవలి కాలంలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి.

గండిపేట జలాశయంలో నీటిమట్టం 1,790 అడుగుల స్థాయికి చేరుకోగా, గేట్లను తెరిచి, నీటిని మూసీలోకి వదిలేందుకు అధికారులు సన్నాహకాలు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది, మూసీ నది వెళ్లే మార్గమంతా అలర్ట్ ప్రకటించారు. 2010లో కురిసిన భారీ వర్షాలకు ఈ జలాశయాలు నిండగా, అప్పట్లో గేట్లను తెరిచారు.

ఆ తరువాత మరోసారి నేడు గేట్లను తెరవనున్నామని నీటి పారుదల శాఖ అధికారులు తెలియజేశారు. ఎగువ నుంచి మరింత వరద వస్తుండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం నిల్వ ఉన్న నీటితో మరో రెండేళ్ల పాటు నగర వాసులకు మంచినీటికి కొరత ఉండదని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.


More Telugu News