తెగిన బంధం... బీజేపీతో తెగదెంపులు చేసుకున్న దీర్ఘకాల మిత్రపక్ష పార్టీ శిరోమణి అకాలీదళ్!

  • ఎన్డీయే వ్యవస్థాపక పార్టీగా ఉన్న ఎస్ఏడీ
  • ఇటీవలి వ్యవసాయ బిల్లులపై తీవ్ర వ్యతిరేకత
  • ఈ బిల్లులు రైతుల పట్ల అశనిపాతాలన్న సుఖ్ బీర్ సింగ్
బీజేపీకి సుదీర్ఘకాలంగా మిత్రపక్ష పార్టీగా ఉండటంతో పాటు, ఎన్డీయే వ్యవస్థాపక పార్టీల్లో ఒకటిగా ఉన్న శిరోమణి అకాలీదళ్, తన బంధాన్ని తెంచుకుంది. మూడు వ్యవసాయ బిల్లుల ఆర్డినెన్స్ లను తేవడానికి ముందు నుంచే బీజేపీతో వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ, బిల్లులను పార్లమెంట్ ఆమోదించిన తరువాత, కఠిన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎన్డీయేతో కలిసుండేది లేదని ఆ పార్టీ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ చండీగఢ్ లో మీడియాకు వెల్లడించారు.

"పార్టీ అత్యున్నత కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఏకగ్రీవం. మేము బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నాం. రైతు వ్యతిరేక బిల్లులను ప్రభుత్వం బలవంతంగా రుద్దాలని చూడటమే ఇందుకు కారణం. ఈ బిల్లులు రైతుల పట్ల అశనిపాతాలు. విషపూరితం" అని సుఖ్ బీర్ సింగ్ నిప్పులు చెరిగారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతు నిరసనలకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని, ఈ బిల్లులను వెనక్కు తీసుకోవాల్సిందేనని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

కాగా, ఎన్డీయే కూటమిని ప్రారంభించిన వేళ, శివసేన, తెలుగుదేశం, శిరోమణి అకాలీదళ్ పార్టీలు బీజేపీకి మద్దతు పలికిన మూడు పెద్ద పార్టీలన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శివసేన, తెలుగుదేశం ఎన్డీయేను వీడగా, తాజాగా, అకాలీదళ్ కూడా బయటకు రావడం గమనార్హం. అయితే, ప్రస్తుతానికి లోక్ సభతో పాటు, ప్రభుత్వంలో పూర్తి బలం ఉన్నందున బీజేపీకి వచ్చిన నష్టమేమీ లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


More Telugu News