వామ్మో... అతడు బ్యాటింగ్ కు వెళుతుంటే ఓ వస్తాదులా కనిపిస్తాడు: దినేశ్ కార్తీక్

  • నేడు ఐపీఎల్ లో కోల్ కతా, సన్ రైజర్స్ మ్యాచ్
  • విండీస్ ఆల్ రౌండర్ రస్సెల్ గురించి వివరించిన కార్తీక్
  • రస్సెల్ ను ఎంఎంఏ ఫైటర్ గా అభివర్ణించిన వైనం
యూఏఈ గడ్డపై జరుగుతున్న ఐపీఎల్ పోటీల్లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ తో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ఈ నేపథ్యంలో కోల్ కతా నైట్ రైడర్స్ సారథి దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోల్ కతా జట్టులో కీలక ఆటగాడైన వెస్టిండీస్ ఆల్ రౌండర్ అండ్రీ రస్సెల్ ను ఓ బీభత్సకరమైన ప్లేయర్ గా అభివర్ణించాడు.

రస్సెల్ బ్యాటింగ్ వెళ్లేటప్పుడు ఎంతో భీతిగొలిపేలా కనిపిస్తాడని, ఆ సమయంలో అతడు మైదానంలోకి వెళుతుంటే ఓ వస్తాదు వెళుతున్నట్టే ఉంటుందని దినేశ్ కార్తీక్ వివరించాడు. ఏ జట్టయినా రస్సెల్ విధ్వంసం నుంచి కాపాడాలని దేవుడ్ని ప్రార్థించక తప్పదని, ఏదో ఒకటి మొక్కుకోవాలని, అతడు సరైన మూడ్ లే కుండా ఉండేలా చూడమని వేడుకోవాలని, ఆ తర్వాతే పిచ్ కండిషన్, ఇతర పరిస్థితులు చూసుకోవాలని చమత్కరించాడు.

బ్యాటింగ్ కు సన్నద్ధమయ్యే సమయంలో అతడి కండలు అవీ చూస్తుంటే ఓ ఎంఎంఏ ఫైటర్ ను తలపిస్తాడని వెల్లడించాడు. హలో దుబాయ్ అనే కార్యక్రమం కోసం క్రికెటర్ అశ్విన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ ఈ వ్యాఖ్యలు చేశాడు.


More Telugu News