ముగ్గురు కీలక తెలుగు నేతలకు షాకిచ్చిన బీజేపీ అధిష్ఠానం!

  • కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన జేపీ నడ్డా
  • స్థానం కోల్పోయిన రాంమాధవ్, మురళీధర్ రావు, జీవీఎల్
  • డీకే అరుణ, పురందేశ్వరి, లక్ష్మణ్, సత్యకుమార్ లకు చోటు
బీజేపీ తన జాతీయ కార్యవర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన కొత్త టీమ్ ను ప్రకటించారు. 70 మందితో కూడిన పార్టీ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ కొత్త జాబితాలో తెలంగాణ నుంచి ఇద్దరికి, ఏపీ నుంచి ఇద్దరికి ప్రాతినిధ్యం లభించింది. తెలంగాణ విషయానికి వస్తే 12 మంది జాతీయ ఉపాధ్యక్షుల్లో ఒకరిగా డీకే అరుణకు అవకాశం లభించింది. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్ కె.లక్ష్మణ్ కు ఛాన్స్ లభించింది. ఏపీ నుంచి పురందేశ్వరి (జాతీయ ప్రధాన కార్యదర్శి), సత్య కుమార్ (జాతీయ కార్యదర్శి)లకు ప్రాతినిధ్యం లభించింది.

ఇదే సమయంలో పార్టీలో ఇప్పటి వరకు చక్రం తిప్పిన తెలుగు ప్రముఖులకు బీజేపీ అధిష్ఠానం షాకిచ్చింది. ఇప్పటి వరకు జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న రాంమాధవ్, మురళీధర్ రావులు కమిటీలో స్థానం కోల్పోయారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పటివరకు కీలకంగా వ్యవహరించిన జీవీఎల్ నరసింహారావును కూడా ఈసారి పక్కన పెట్టారు. మరోవైపు రాంమాధవ్, మురళీధర్ లకు రాజ్యసభ సభ్యులుగా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చర్చ జరుతోంది. వీరిలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి కూడా లభించే అవకాశం ఉన్నట్టు చెపుతున్నారు. ఏం జరగబోతోందో వేచి చూడాలి.


More Telugu News