ఈ హనుమాన్ జంక్షన్ పోలీసు కానిస్టేబుల్ కు నీరాజనాలు పడుతున్న నెటిజన్లు!

  • వర్షంలోనూ ట్రాఫిక్ విధులు
  • కుండపోతను కూడా లెక్కచేయకుండా విధి నిర్వహణ
  • ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పీ
  • అభినందించిన హోంమంత్రి, డీజీపీ
ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. వర్షాలకు ఎవరు విశ్రాంతి తీసుకున్నా, పోలీసు, వైద్య సిబ్బంది వంటి అత్యవసర సేవల విభాగాలు మాత్రం ఎప్పటికీ విశ్రాంతి కోరుకోవు. అందుకు నిదర్శనంగా నిలిచే ఓ ఘటనను కృష్ణా జిల్లా పోలీసు యంత్రాంగం ట్విట్టర్ లో పంచుకుంది. జిల్లాలోని హనుమాన్ జంక్షన్ సర్కిల్ అంటే ట్రాఫిక్ రద్దీకి మారుపేరు. అక్కడ నిత్యం ఓ కానిస్టేబుల్ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

అయితే సెప్టెంబరు 25న దేవిశెట్టి శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ ఆ సర్కిల్ వద్ద ట్రాఫిక్ విధులకు పంపారు. శ్రీనివాస్ విధులు నిర్వర్తిస్తుండగా భారీ వర్షం ప్రారంభమైంది. వర్షం కురుస్తున్నా ఓ వైపు భారీగా ట్రాఫిక్ వస్తుండడంతో శ్రీనివాస్ వర్షంలోనే నిలబడి విధులు నిర్వర్తించాడు. వర్షం కారణంగా ట్రాఫిక్ అస్తవ్యస్తమయ్యే పరిస్థితి ఉండడంతో ఆయన ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాడు.

జడివానను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో చిత్తశుద్ధి ప్రదర్శించిన దేవిశెట్టి శ్రీనివాస్ నిబద్ధతను ఉన్నతాధికారులు గుర్తించారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆ కానిస్టేబుల్ ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్టు పెట్టగా, రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితతో పాటు డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా మనస్ఫూర్తిగా అభినందించారు. వర్షంలో ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్న శ్రీనివాస్ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ కానిస్టేబుల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


More Telugu News