ఇన్ స్టాగ్రామ్ లో సరికొత్త బగ్... అప్రమత్తమైన ఫేస్ బుక్

  • ఇన్ స్టాగ్రామ్ పై హ్యాకర్ల కన్ను
  • జేపీఈజీ ఇమేజ్ తో బగ్ ప్రవేశం
  • డౌన్ లోడ్ చేసుకుంటే బగ్ తో ముప్పు
సోషల్ మీడియా వ్యాప్తి పెరిగిన తర్వాత హ్యాకర్ల కన్ను ఇటువైపు పడింది. సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసి వ్యక్తిగత వివరాలతో కూడిన డేటాను తస్కరిస్తున్న ఘటనలు అంతకంతకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ ఫోటో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్ లో సరికొత్త బగ్ ప్రవేశించిందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు అంటున్నారు.

ఈ బగ్ సాయంతో ప్రపంచంలో ఎక్కడ్నించి అయినా ఇన్ స్టాగ్రామ్ లోని అకౌంట్లలో అనుమతి లేకుండా ప్రవేశించేందుకు హ్యాకర్లకు వీలు కలుగుతుంది. నెటిజన్ల పర్సనల్ మెసేజ్ లు చదవడంతో పాటు, యూజర్ల టైమ్ లైన్ లో ఏదైనా పోస్టు చేసే అవకాశం కలుగుతుంది. అంతేకాదు, వారి కాల్ లిస్టు, కెమెరా, లొకేషన్ సమాచారం అన్నీ ఈ బగ్ అధీనంలోకి వెళతాయి.

ఈ బగ్ ఎలా ప్రవేశిస్తుంది అంటే... హ్యాకర్లు ముందుగా జేపీఈజీ ఫార్మాట్ లో ఉన్న ఓ ఇమేజ్ పంపుతారు. ఆ ఇమేజ్ ను ఎవరైనా డౌన్ లోడ్ చేసుకుంటే వారి అకౌంట్ లోకి బగ్ చొరబడుతుంది. అయితే, ఈ ప్రమాదకర బగ్ ను సైబర్ నిపుణులు ముందే గుర్తించారు. ఇన్ స్టాగ్రామ్ మాతృసంస్థ ఫేస్ బుక్ ను ఈ మేరకు అప్రమత్తం చేశారు.

దీనిపై వెంటనే స్పందించిన ఫేస్ బుక్ బగ్ నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ సైబర్ భద్రతను మరింత పెంచింది.


More Telugu News