దీపిక తెలిపిన వివరాలపై ఎన్సీబీ అధికారుల అసంతృప్తి!

  • దీపిక పదుకొనేను విచారించిన ఎన్సీబీ అధికారులు  
  • కరిష్మా ప్రకాశ్ తో సాధారణ సంబంధాలున్నాయన్న దీపిక
  • డ్రగ్స్ సంబంధాలు లేవని స్పష్టీకరణ
  • దీపిక వాదనలపై ఎన్సీబీ అధికారుల అనుమానం!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంలో డ్రగ్స్ కోణంపై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలో బాలీవుడ్ నటి దీపిక పదుకొనేను నేడు ఎన్సీబీ అధికారులు విచారించారు. అయితే విచారణ సందర్భంగా దీపిక చెప్పిన సమాధానాలతో ఎన్సీబీ అధికారులు అసంతృప్తికి గురయ్యారు. ఈ కేసులో కీలకంగా ఉన్న కరిష్మా ప్రకాశ్ తో తనకు సాధారణ సంబంధాలే తప్ప డ్రగ్స్ సంబంధాలు లేవని దీపిక తెలిపింది.

అయితే ఎన్సీబీ అధికారులు ఆమె వాదనలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరిష్మా ప్రకాశ్ చెప్పిన వివరాల ప్రకారం తమ డ్రగ్స్ గ్రూపులో దీపికనే కీలకమని, ఆమే గ్రూప్ అడ్మిన్ అని తెలిపినట్టు సమాచారం.

మరోవైపు, దీపికతో పాటు తాను కూడా విచారణకు వస్తానని ఆమె భర్త రణవీర్ సింగ్ తమను అభ్యర్థించినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని ఎన్సీబీ స్పష్టం చేసింది. దీపిక విచారణలో ఒత్తిడికి గురయ్యే అవకాశముందని, అందుకే తాను కూడా ఆమె పక్కనే ఉండాలనుకున్నట్టు రణవీర్ తమను కోరాడనడంలో నిజంలేదని ఎన్సీబీ అధికారులు తెలిపారు.


More Telugu News