పబ్ జీపై కన్నేసిన ముఖేష్ అంబానీ... జియోతో భాగం చేసేందుకు చర్చలు!

  • ఇండియాలో పబ్ జీపై నిషేధం
  • చైనా కంపెనీతో డీల్ కట్ చేసుకున్న బ్లూ హోల్ స్టూడియో
  • వెంటనే రంగంలోకి దిగిన రిలయన్స్
  • జియో, పబ్ జీ కార్పొరేషన్ మధ్య చర్చలు
ప్రభుత్వ నిషేధానికి గురైన పాప్యులర్ స్మార్ట్ ఫోన్ గేమ్ పబ్ జీని తిరిగి ఇండియాలోని వినియోగదారులకు అందించాలని భావిస్తున్న ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ జియో, పబ్ జీ కార్పొరేషన్ తో ఇప్పటికే ప్రాధమిక చర్చలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. పబ్ జీ కొనుగోలుపై తీవ్ర కసరత్తు జరుగుతోందని, డీల్ సాధ్యాసాధ్యాలను జియో న్యాయ నిపుణులను కూడా సంప్రదించిందని సమాచారం.

ఈ డీల్ ప్రధానంగా రెండు అంశాలపైనే జరుగుతున్నట్టు సంస్థ వర్గాలు అంటున్నాయి. అందులో మొదటిది 50 శాతం చొప్పున ఇరు కంపెనీలూ వాటాలతో పబ్ జీ కార్పొరేషన్ ను ఇండియాలో నిర్వహించడం. ఇక రెండోది నెలవారీ యూజర్ల ఆధారంగా కార్పొరేషన్ కు కొంత మొత్తాన్ని చెల్లించడం. ఈ రెండు అంశాలపై చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది.

అపారమైన గేమింగ్ మార్కెట్ ఉన్న ఇండియాలో, ఈ విభాగంలోకి కూడా రావాలని రిలయన్స్ భావిస్తున్న వేళ, ఇప్పటికే ఎంతో చొచ్చుకుపోయిన పబ్ జీ అయితే, తొలి అడుగు ఘనంగా వేయవచ్చని సంస్థ భావిస్తోందని సమాచారం.

కాగా, ఈ గేమ్ ను దక్షిణ కొరియాకు చెందిన బ్లూ హోల్ స్టూడియో తయారు చేసింది. చైనాకు చెందిన టెన్సెంగ్ గేమ్స్ చేతిలో ఇది ఉండటంతో, సమాచార చట్టం సెక్షన్ 69 ప్రకారం, పలు యాప్ లపై భారత్ నిషేధించగా, అందులో పబ్ జీ కూడా ఉంది. ఆపై చైనా కంపెనీ నుంచి బ్లూ హోల్ స్టూడియోస్ దూరం కావడంతో ఈ గేమ్ పై ఉన్న క్రేజ్ ను తన సొంతం చేసుకోవాలని జియో రంగంలోకి దిగింది. కాగా, ఈ డీల్ పై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.


More Telugu News