ఈ చర్యలు భారత్‌లో మరింత సంక్షోభానికి దారితీస్తాయి: కరోనాపై లాన్సెట్ హెచ్చరిక

  • భారత్‌లో ఊహించని రీతిలో కరోనా కేసులు 
  • భారత ప్రభుత్వం ఏమీ కాదులే అన్న ధోరణితో ఉంది
  • ఐసీఎంఆర్ శాస్త్రీయ ఆధారాల నుంచి పక్కకుపోతోంది
  • ప్రజలకు తప్పుడు సంకేతాలు అందుతాయి
భారత్‌లో ఊహించని రీతిలో కరోనా కేసులు పెరిగిపోతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అనుసరిస్తోన్న విధానాలను విమర్శిస్తూ లాన్సెట్ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా ఉద్ధృతి అత్యధికంగా ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం ఏమీ కాదులే అన్న ధోరణితో వ్యవహరిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.

అలాగే, ఐసీఎంఆర్ శాస్త్రీయ ఆధారాల నుంచి పక్కకుపోతోందని లాన్సెట్ మెడికల్ జర్నల్ సంపాదకీయంలో చెప్పింది. ఈ ధోరణులతో ప్రజలకు తప్పుడు సంకేతాలు అందుతాయని చెప్పింది. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజలను ఈ చర్యలు నిరోధిస్తాయని చెప్పింది. ఈ చర్యలు భారత్‌లో మరింత సంక్షోభానికి దారితీస్తాయని చెప్పింది.  

కరోనా విజృంభణ పట్ల భారత సర్కారు చాలా పాజిటివ్ ధోరణితో  ఉందని తెలిపింది. విపరీతమవుతోన్న కొవిడ్‌  సంక్షోభం మధ్య వాస్తవాలను దాచవద్దని తెలిపింది. అసలు నిజాలు చెప్పకపోతే ప్రజలకు ప్రమాదమని హెచ్చరించింది. కరోనాను కప్పిపెడుతూ ఆశావాదాన్ని ప్రోత్సహించే విధంగా చేస్తోన్న ఒత్తిడి కారణంగా భారత్‌లో శాస్త్రీయ సంస్థలు కూడా ఆ దిశగా ప్రభావితమయ్యాయని పేర్కొంది.

అలాగే, భారత్‌ నుంచి కరోనాకు కోవాక్సిన్ టీకాను ఈ ఏడాది ఆగస్టు 15లోగా అందుబాటులోకి  తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని కొన్ని నెలల క్రితం ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ చేసిన ప్రకటనను కూడా లాన్సెట్‌ తప్పుబట్టింది. అంతేకాదు. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ మరణాల రేటు భారత్‌లో ఉందని ప్రభుత్వం వాదించడాన్ని కూడా తప్పుబడుతూ.. భారత్ చెబుతోన్న ఈ సంఖ్యలు పోల్చదగినవా? అని తెలుసుకోవడం కష్టంగా ఉందని చెప్పింది. భారత నాయకులు శాస్త్రీయ ఆధారాలను, నిపుణుల సలహాలపై దృష్టి పెట్టాలని చెప్పింది.


More Telugu News