కొవిడ్ తీవ్రంగా ఎందుకు మారుతుందంటే?: కారణాలను వెల్లడించిన శాస్త్రవేత్తలు

  • యాంటీబాడీలు తప్పుదోవ పట్టి రోగ నిరోధక వ్యవస్థపైనే దాడి
  • లోప భూయిష్ట జన్యు ఉత్పరివర్తనాలు మరో కారణం
  • రాక్‌ఫెల్లర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
కరోనా మహమ్మారి కొందరిపై ఎందుకు తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న కారణాలు తెలుసుకునేందుకు అమెరికాలోని రాక్‌ఫెల్లర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. కొవిడ్ బారినపడుతున్న పదిశాతం మంది యువకులు, ఆరోగ్యవంతుల్లో యాంటీబాడీలు తప్పుదోవ పట్టడమే ఇందుకు కారణమని తేలింది. తప్పుడు సంకేతాల కారణంగా యాంటీబాడీలు వైరస్‌పై కాకుండా స్వీయ రోగ నిరోధక వ్యవస్థపైనే దాడి చేస్తున్నట్టు గుర్తించారు. మరో 3.5 శాతం మందిలో లోపభూయిష్ట జన్యు ఉత్పరివర్తనాలు ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

కరోనా బారినపడినప్పటికీ కొందరిలో ఆ లక్షణాలు లేకపోవడం, మరికొందరు మరణించడానికి జన్యుపరివర్తనతోపాటు తప్పుదోవపట్టిన యాంటీబాడీలే కారణమని వివరించారు. పుట్టుకతో వచ్చిన రోగనిరోధకశక్తిలో భాగమైన 17 ప్రొటీన్లతో కూడిన ‘టైప్ ఐ ఇంటర్ ఫెరాన్’ లోపిస్తున్నట్టు చెప్పారు.

వైరస్‌లు దాడిచేసినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ స్పందించడానికి ముందే ఇవి రంగంలోకి దిగి రక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తాయన్నారు. అయితే, కొవిడ్ తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు కొందరి శరీరంలోని యాంటీబాడీలు ఈ ఇంటర్‌ఫెరాన్లను నాశనం చేయడమో, లేదంటే లోపభూయిష్ట జన్యు ఉత్పరివర్తనల వల్ల అవి సరిపడా ఉత్పత్తి కాకపోవడమే జరుగుతుందని, ఫలితంగా మరణాలు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.


More Telugu News