డ్రగ్స్ కేసులో రకుల్ వంతు పూర్తి... నేడు దీపికా పదుకొనే విచారణ!

  • శుక్రవారం రకుల్ ను 4 గంటల పాటు విచారించిన ఎన్సీబీ
  • రకుల్ స్టేట్ మెంట్ ను రికార్డు చేశాం
  • ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ అశోక్ జైన్ వెల్లడి
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో, పలువురు బాలీవుడ్, టాలీవుడ్ నటీమణులకు నోటీసులు పంపిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు, శుక్రవారం నాడు రకుల్ ప్రీత్ సింగ్ ను విచారించారు. దాదాపు నాలుగు గంటల పాటు ఆమెను విచారించిన అధికారులు, పలు కీలక విషయాలను రాబట్టారు. ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేశామని పేర్కొన్న ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ అశోక్ జైన్, ఆ సమాచారాన్ని విశ్లేషించిన తరువాత కోర్టుకు నివేదిస్తామని తెలిపారు.

కాగా, నేడు మరో హీరోయిన్ దీపికా పదుకొనేను విచారించనున్నట్టు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్ ను శుక్రవారం విచారించామని, ఆపై డ్రగ్స్ వ్యవహారంలో దీపిక ప్రమేయం ఉందన్న సమాచారం లభించిందని కూడా ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. నిందితుల మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ తమ విచారణలో కీలకమని స్పష్టం చేశారు. కాగా, శుక్రవారం నాడు అసిస్టెంట్ డైరెక్టర్లు క్షితి రవి ప్రసాద్, అనుభవ్ చోప్రాలను కూడా విచారించారు. ఆపై క్షితి ఇంటిలో సోదాలు కూడా నిర్వహించారు. క్షితి పేరు డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న వారిని విచారించగా, తెలిసిందని ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి.


More Telugu News